మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. (మత్త 24:6)
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడిసముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. (కీర్త 46:1-3)
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. (కీర్త 112:7)
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. (యోహా 16:33)
నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము. (యెష 26:20,21) ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. (కీర్త 57:1) మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. (కొల 3:3)