పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 07 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /07

రోమీయులకు వ్రాసిన పత్రిక 5:1-11, 18-21, 6:1-4, 11-15, 21-23

కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు  ద్వారా, దేవునితో సమాధానము కలిగియుందము. (కొన్ని ప్రాచీన ప్రతులలో – కలిగియున్నాము అని పాఠాంతరము) మరియు ఆయన ద్వారా, మనము విశ్వాసము వలన, ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన, నిరీక్షణను బట్టి, అతిశయపడుచున్నాము. అంతే కాదు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను (శీలమును) కలుగజేయునని యెరిగి, శ్రమల యందును, అతిశయపడుదము. ఎందుకనగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ప్రేమ, మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. ఏలయనగా, మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు, యుక్త కాలమున, భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము, ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైన, ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు, మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా, ఆయన ద్వారా, ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా, శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా, మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల, సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుట చేత, మరి నిశ్చయముగా రక్షింప బడుదుము. అంతేకాదు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, మనము దేవునియందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము.

కాబట్టి, తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు, ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము, మనుష్యులకందరికిని, జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయత వలన, అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించునట్లు, ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను, పాపము మరణమును ఆధారము చేసికొని, యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, పాపమెక్కడ విస్తరించెనో, అక్కడ, కృప అపరిమితముగా విస్తరించెను.

ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి యుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము, ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మన మందరము, ఆయన మరణము లోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును, నూతన జీవము పొందినవారమై, నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన, మరణములో పాలుపొందుటకై, ఆయనతో కూడ పాతిపెట్టబడితివిు.

అటువలె మీరును, పాపము విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను, మిమ్మును మీరే యెంచుకొనుడి. కాబట్టి, శరీర దురాశలకు లోబడునట్లుగా, చావునకు లోనైన మీ శరీరమందు, పాపమును ఏలనియ్యకుడి. మరియు, మీ అవయవములను, దుర్నీతి సాధనములుగా (ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలోనుండి, సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని, ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన యెడల, కృపకే గాని, ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని, పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.

అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను, ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి, దేవునికి దాసులైనందున, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. ఏలయనగా, పాపమువలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము, మన ప్రభువైన క్రీస్తుయేసునందు, నిత్య జీవము.

కీర్తనలు 149:1-9

యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో, ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.  ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానినిబట్టి సంతోషించుదురు గాక. సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. తంబుర తోను సితారాతోను, ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.  యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై, తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.  వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రము లున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే. యెహోవాను స్తుతించుడి.

Leave a Comment