పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 06 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /06

ఆదికాండము 6:1-3,5-14,17-22, 7:1,7,11,12

నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ, నరులతో ఎల్లప్పుడును వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై (శరీరులై) యున్నారు. అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.

నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు, ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులును, నరులతోకూడ జంతువులును, పురుగులును, ఆకాశ పక్ష్యాదులును, భూమిమీద నుండకుండ తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించి,  తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, తన హృదయములో నొచ్చుకొనెను.  అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు, అది చెడిపోయి యుండెను. భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.  దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది, గనుక, నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను, వెలుపటను, దానికి కీలు పూయవలెను.

ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను, ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు, భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతోకూడ నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును, ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు, సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలోనివి, రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై ,వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము, నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని, నీదగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

యెహోవా, ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని, గనుక, నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.

అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును, ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.

నోవహు వయసుయొక్క ఆరు వందల సంవత్సరము, రెండవ నెల పదియేడవ దినమున, మహాగాధజలముల ఊటలన్నియు, ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నలుబది పగళ్లును, నలుబది రాత్రులును, ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.

కీర్తనలు16:1-11[దావీదు రసిక కావ్యము]

దేవా, నీ శరణుజొచ్చియున్నాను. నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు. నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును. భూమి మీదనున్న భక్తులే శ్రేష్టులు. వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను. వారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము. నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదా కాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక, నేను కదల్చబడను. అందువలన, నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ (మూల భాషలో మహిమ) హర్షించుచున్నది. నా శరీరముకూడ సురక్షితముగా నివసించు చున్నది. ఎందుకనగా, నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. (లేక గోతిని చూడనియ్యవు) జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

 

Leave a Comment