ఆలయ ప్రతిష్ఠ – Church Dedication Service Program Sermon Scripture Pdf

ప్రార్ధన గృహమును (ఆలయమును) ప్రతిష్ఠించు ఆరాధన క్రమము (Church Dedication Service Program)

(కీర్తన గాని సంగీతము గాని పాడుచు, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయవచ్చును)
(ఆలయ ద్వారము మూయబడి యుండగా, దాని యొక్క చరిత్ర క్లుప్తముగా చదువబడును)
(ఆరాధన గురువు తలుపు తెరచి, యిట్లు చెప్పును)
తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామమున మేము ఈ దేవుని ఆలయము తలుపు తెరచి, ఆయన జనులను లోపలి ఆహ్వానించుచున్నాము. ఆమేన్.
(గురువు లోపలి ప్రవేశించి చెప్పవలసినది ఏమనగా)
ఈ ఆలయమునకును, దీనిలో ఆరాధించువారికిని, సమాధానము కలుగును గాక. దీని లోపలి వచ్చు వారికిని, వెలుపలికి వెళ్ళు వారికిని సమాధానము కలుగును గాక.
దీని ప్రేమించు వారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రేమించు వారికిని, సమాధానము కలుగును గాక. ఆమేన్.
(జనులు ప్రవేశించి నిలిచియుండగా గురువు యిట్లు చెప్పును)
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
జనులు: భూమ్యాకాశములను సృజించినవాడు ఆయనే.
భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. (కీర్త 124:8)
గురువు: యెహోవా ఇల్లు కట్టించనియెడల,
జనులు: దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. (కీర్త 127:1)
(ఒక కీర్తన గాని సంగీతము గాని 24 వ కీర్తన గాని పాడుదురు)
భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును, యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు, పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యముల కధిపతియగు యెహోవాయే. ఆయనే, యీ మహిమగల రాజు. (కీర్త 24:1-10)
(గురువు యిట్లు చెప్పును): ప్రియ సహోదరులారా, దైవారాధన కొరకు ఈ ఆలయము కట్టుటకు (లేక ఒక స్థలము ప్రత్యేక పరచుటకు) తన సేవకుల హృదయములను, ఆయన తన చిత్త ప్రకారము ప్రేరేపించినందున, దేవుని మిక్కిలి పరిశుద్ధ నామ ఘనత కొరకు, దీనిని యిప్పుడు ప్రతిష్ఠించుదము.
మనలను ప్రేమించి, తన ప్రియునియందు మనలను అంగీకరించిన, తండ్రియైన దేవుని మహిమ కొరకు, మనలను ప్రేమించి, మన కొరకు తనను తాను అప్పగించుకొనిన కుమారుని మహిమ కొరకు, మనలను వెలిగించి, పవిత్రపరచు పరిశుద్ధాత్మ కొరకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
స్తుతి ప్రార్ధనలతో దేవుని ఆరాధించుట కొరకు, ఆయన పరిశుద్ధ వాక్యము చదువుటకు, సిలువ వేయబడి, తిరిగి లేచి, పరలోకమున కెక్కిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించుట కొరకు, ఆయన కృపా సంస్కారములు ఆచరణ కొరకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: మార్గము వెదకువారందరికిని వెలుగు చూపుటను, శోధింపబడువారిని బలపరచుటకును, దుఃఖపడు వారందరిని ఓదార్చుటకును, రోగులందరికి ఆరోగ్యము వచ్చుటకును,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: ప్రభువు నందలి జ్ఞానము, భయము, పెంపొందించుటకు, యౌవ్వనులకు బోధించి నడిపించుటకు, త్రోవ తప్పినవారినందరిని మరలించుటకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: ఒకే విశ్వాసమందును, పరిశుద్ధుల సహవాసమందును, అందరియెడల ప్రేమ, సానుభూతి యందును, పరిశుద్ధాత్మ ద్వారా దైవ నివాస స్థలముగా నుండుటకు, మనకు అనుగ్రహింపబడిన దానమగు ఈ ఆలయము కొరకు కృతజ్ఞతగాను, దేవుని గృహమునకు చెందినవారమైన మనము, ఇప్పుడు ప్రతిష్ఠించుకొందము.
జనులు: దైవారాధన కొరకును, ఆయన రాజ్యమందలి సేవ కొరకును, మనలను మనము ప్రతిష్ఠించుకొను చున్నాము.
ప్రార్ధించుదము: (ఈ దిగువ వాటిలో యుక్తమైన విజ్ఞాపనలను చేయవచ్చును)
ఓ ప్రభువా, ఇది ఎల్లప్పుడు మాకు మా తండ్రి గృహముగా ఉండునట్లును, ఇక్కడ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలుసుకొనునట్లును, దయచేయుము. ఆమేన్.
ఈ గృహములో నీ పరిశుద్ధ వాక్యమును చదువు వారును, బోధించువారును, వినువారందరును, పరిశుద్ధ లేఖనములలో జీవ వాక్యమును బయలుపరచు నీ యెడల, కృతజ్ఞత కలిగి యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఈ గృహములో మేము పాడు కీర్తనలు, పరిశుద్ధమైన హృదయముల నుండియు, పవిత్రమైన పెదవుల నుండియు, బయలు వెడలునట్లు దయచేయుము. ఆమేన్.
నీ బిడ్డలు యిక్కడ చేయు ప్రార్ధనలు, అర్పించు అర్పణలు, ఎల్లప్పుడు నీ దృష్టికి అంగీకృతమై యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఇక్కడ బాప్తీస్మము పొందువారును, నిర్ధారణ పొందువారును, తమ జీవితాంతము, క్రీస్తు యొక్క నమ్మకమైన భటులును, సేవకులునై యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఇక్కడ జరుగు వివాహము లన్నియు, నీ దీవెన పొందునట్లును అనుగ్రహింపుము. ఆమేన్.
మా రక్షకుని ఆజ్ఞకు విధేయులమై, ఇక్కడ నీ బిడ్డలు ఆయన శరీర రక్తములు, సంస్కారములును పొంది, జీవాహారములో పాలిభాగస్తులై, నిరీక్షణ ద్వారా, నిత్యజీవమునకు వారసులమగునట్లు దయచేయుము. ఆమేన్.
ఈ స్థలములో జరుగున దంతయు, నీకు ప్రియామైనదిగా నుండునట్లు దయచేయుము. మా అనుదిన జీవితములను స్తుతి యాగముగాను, మా ఉల్లాసములను పరమానందముగాను మార్చి, మా వాక్య పఠనము ద్వారా మమ్మును నీ చెంతకు చేరదీయ అనుగ్రహించుము. ఆమేన్.
మన ప్రార్ధన లన్నిటిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున తానే నేర్పిన మాటలతో అర్పించుదము. ఆమేన్.
ప్రభువు ప్రార్ధన: పరలోక మందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించుచున్న ప్రకారము, మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా, రాజ్యమును, శక్తియు, మహిమయు, నిరంతరము నీవియై యున్నవి. ఆమేన్.
(గురువు యిట్లు చెప్పును): సర్వశక్తి గల దేవుని ఆరాధనకును, సేవకును, ఈ ఆలయమును (ఆలయము పేరు ….) ప్రత్యేకపరచుచున్నానని, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము పేరట ప్రకటించుచున్నాను. ఆయనకే యుగ యుగములకును, మహిమ, ఘనత, రాజ్యము, శక్తి కలుగును గాక.
జనులు: ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక.

Church Dedication Service Scripture & Sermon

(ఇక్కడ ఒక సంగీతము లేక కీర్తన పాడవచ్చును. లేక వేద పాఠముల మధ్యను పాడవచ్చును)
(ఈ పాఠములలో ఒకటి లేక ఎక్కువ చదువ వచ్చును: నిర్గ 40:17-34; 24వ కీర్తన; 84వ కీర్తన; ఎఫె 2:19-22 మత్త 21:14-16)
నిర్గ 40:17-34: రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే మందిరమును నిలువ బెట్టి, దాని దిమ్మలను వేసి, దాని పలకలను నిలువబెట్టి, దాని పెండె బద్దలను చొనిపి, దాని స్తంభములను నిలువబెట్టి, మందిరము మీద గుడారమును పరచి, దానిపైని గుడారపు కప్పును వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు శాసనములను తీసికొని, మందసములో ఉంచి, మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి, దానిమీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి, కప్పు తెరను వేసి, సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో, మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి, యెహోవా సన్నిధిని, దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో, మందిరమునకు దక్షిణ దిక్కున, బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి, యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట, బంగారు ధూపవేదికను ఉంచి, దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి, దానిమీద దహనబలి నర్పించి, నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారమునకును, బలిపీఠమునకును మధ్య, గంగాళమును ఉంచి, ప్రక్షాళణ కొరకు దానిలో నీళ్లు పోసెను.
దానియొద్ద మోషేయు, అహరోనును, అతని కుమారులును, తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును, బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును, బలిపీఠమునకును చుట్టు, ఆవరణమును ఏర్పరచి, ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. (నిర్గ 40:17-34)
కీర్త 24:1-10: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును, యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును, కలిగి యుండువాడే.
వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు, అట్టివారే. (సెలా.) గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి. మహిమగల రాజు ప్రవేశించునట్లు, పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు. (కీర్త 24:1-10)
84వ కీర్తన: సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మ సిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యముల కధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా.) నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్లుచు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు, ప్రయాణము చేయుదురు.
వారిలో ప్రతివాడును, సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవి యొగ్గుము. (సెలా.) దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట, వెయ్యి దినముల కంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యముల కధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. (84వ కీర్తన)
ఎఫె 2:19-22: కాబట్టి మీరికమీదట పరజనులును, పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును, దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా, అపొస్తలులును, ప్రవక్తలును వేసిన పునాదిమీద, మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
ఆయనలో మీరు కూడ, ఆత్మమూలముగా, దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. (ఎఫె 2:19-22)
మత్త 21:13-16: నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది. గ్రుడ్డివారును, కుంటివారును, దేవాలయములో ఆయన యొద్దకు రాగా, ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి, కోపముతో మండిపడి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి.
అందుకు యేసు, వినుచున్నాను; బాలురయొక్కయు, చంటిపిల్లల యొక్కయు, నోట, స్తోత్రము సిద్ధింపజేసితివి, అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పెను. (మత్త 21:13-16)
(యిక్కడ ప్రసంగము చేయవచ్చును)

Church Dedication Service Conclusion

(పరిశుద్ధ బల్ల, ప్రభు భోజన పాత్రలు, బల్లలు ప్రతిష్ఠింప వలసియున్న యెడల, దిగువ ప్రార్ధన చెప్పవచ్చును)
ఓ ప్రభువా, ఈ బల్లను, (యితర వస్తువులను) నీ మహిమ కొరకును, సిలువ మీద అర్పించబడిన అర్పణకు నిత్య జ్ఞాపకార్ధముగాను, ఆశీర్వదించి, ప్రతిష్ఠించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
(కీర్తన గాని, సంగీతము గాని పాడుచుండగా, కానుకలు, అర్పణలు, ప్రార్ధన ఆలయము కొరకైన వస్తువులు అర్పించవచ్చును)
ప్రార్ధించుదము
ఓ ప్రభువా, నీ సేవకై ప్రతిష్ఠించు మా కానుకలను అంగీకరించుమని, వేడుకొనుచున్నాము. ఇప్పుడు మేము ప్రత్యేకపరచిన ఈ ఆలయములో, నీ పరిశుద్ధ నామమును ఆత్మతోను, సత్యముతోను, మేము ఆరాధించునట్లు అనుగ్రహించుము. నీతోను, పరిశుద్ధాతతోను ఏక దేవుడుగా, యుగ యుగములు జీవించి యేలుచుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
దీవెన
(కొంతసేపు మౌన ప్రార్ధనకు తరువాత, గురువు వెళ్ళుచుండగా, సభవారు నిలిచి, ఒక స్తుతి కీర్తన గాని సంగీతము గాని పాడవలెను)

Suvarthaswaram.com

church dedication sermon pdf with ful program telugu.jpg

Leave a Comment