సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రీ, నీ సహాయము లేక, మేమేమియు యోగ్యముగా చేయజాలము. నీవీ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు, తీసికొనివచ్చియున్నావు.
నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులనుగా చేసి, నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించునట్లును, వీరు చేయనైయున్న ప్రమాణములను, వాస్తవముగా నిలుపుకొనునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
Pelli ప్రమాణము – Marriage Vows
[అనంతరము గురువు వరుని యిట్లు అడుగవలెను] – … అను నీవు, … అను ఈ స్త్రీని, నీ భార్యనుగా చేసికొని, ఈమెను మాత్రమే హత్తుకొనియుందువా?
[పురుషుడు చెప్పవలసిన జవాబు] – ఉందును.
[గురువు స్త్రీని యిట్లు అడుగవలెను] – … అను నీవు, … అను ఈ పురుషుని నీ భర్తనుగా చేసికొని, యితనిని మాత్రమే హత్తుకొనియుందువా?
[స్త్రీ చెప్పవలసిన జవాబు] – ఉందును.
[వివాహమాడు స్త్రీ, తలిదండ్రు వలనగాని, సంరక్షకుని వలనగాని, పెండ్లికీయబడుచున్న యెడల, గురువు యిట్లు అడుగవలెను]
వివాహమాడుటకు ఈ స్త్రీని ఈ పురుషునికి యిచ్చువారెవరు? – [తల్లిగాని, తండ్రిగాని, లేక సంరక్షకుడు గాని, ముందుకు వచ్చి, స్త్రీ యొక్క కుడిచేతిని తీసికొని, పురుషుని కుడి చేతిలో నుంచుట ద్వారా, కన్యాదానము చేయవలెను. తలిదండ్రులు గాని సంరక్షకుడు గాని లేనిచో, గురువు, స్త్రీ పురుషులను సంబోధించి యిట్లు చెప్పును]
.. .. అను మీరిరువురు, ఒకరి కుడిచేతిని మరియొకరికి ఇచ్చుకొనుడి.
[ఇప్పుడు పురుషుడు గురువు వెంట చెప్పవలెను.] – … అను నేను, … అను నిన్ను, యిది మొదలుకొని, చావు మనలను ఎడబాపు వరకు, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధియందును, ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి, సంరక్షించుటకై, నా భార్యనుగా చేసికొనుచున్నాను.
ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
[స్త్రీ పురుషులట్లే చేతులు పట్టుకొని యుండగా, స్త్రీ గురువు వెంట చెప్పవలెను] – … అను నేను, … అను నిన్ను, యిది మొదలుకొని, చావు మనలను ఎడబాపు వరకు, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధియందును, ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి, సంరక్షించి, నీకు లోబడియుండుటకై, నా భర్తనుగా చేసికొనుచున్నాను.
ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
[గురువు యిట్లు చెప్పును] – దేవుడు మీ ప్రమాణములను వినియున్నాడు. వాటికి మేము సాక్ష్యులము.
[గురువు, యిప్పుడు మంగళ సూత్రమును, ఉంగరమును లేదా ఉంగరములను ఆశీర్వదించునట్లు చెప్పును]
కనికరముగల ప్రభువా, ఈ మంగళ సూత్రమును (ఉంగరమును) ఆశీర్వదించి, దీని కట్టువారును, (ధరించువారును) ఒకరి యెడల ఒకరు, నిరంతరము నమ్మకముగా మేలుగునట్లును, తామిద్దరు బ్రతుకు కాలమంతయు, ప్రేమతో జీవితము సాగించుకొనునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
[గురువు మంగళ సూత్రమును పురుషునికి యివ్వగా, ఆచార ప్రకారము పురుషుడు దానిని స్త్రీ మెడలో కట్టి, దాని పట్టుకొనును. అది ఉంగరమైన యెడల, గురువు దానిని పురుషునికి ఇవ్వగా, అతడు దానిని స్త్రీ వ్రేలికి తొడిగించి, పట్టుకొనును. అప్పుడు పురుషుడు గురువు వెంట ఇట్లు చెప్పవలెను]
నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును సూచనగా, ఈ మంగళ సూత్రమును (ఉంగరమును) నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి, ఆ ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేసికొనుచున్నాను.
[స్త్రీయు, ఒక ఉంగరమును పురుషునికి యిచ్చిన యెడల, దానిని అతని వ్రేలికి తొడిగించి, పట్టుకొని, గురువు వెంబడి యిట్లు చెప్పవలెను]
నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును సూచనగా, ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి, ఆ ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసికొనుచున్నాను.
[గురువు యిట్లు ప్రకటింపవలెను] – దేవుని సమక్షమందును, ఈ సభ యెదుటను, ఒకరినొకరు తమ ప్రమాణములను చేసియున్నారు. గనుక, దేవుని నిర్ణయమును బట్టియు, ఈ దేశ చట్టమును బట్టియు, వీరిరువురును భార్యా భర్తలని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్.
కాబట్టి, దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు యెడబాపకూడదు.
[ఇప్పుడు వధూవరులు యిద్దరు, మొకాళ్ళూనుదురు. సభ నిలిచియుండును. గురువు యిట్లు ప్రార్ధించును]
Prayer for Marriage
అత్యంత కృపాకనికరములు గల దేవా, పరలోకమందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, యే తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, అట్టి మా తండ్రీ, నీ నామమున దీవించుచున్న ఈ … మీదను, … మీదను, నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము.
వీరు నమ్మకముగా కలిసి జీవించునట్లును, ఉభయుల మధ్య తాము చేసికొనిన నిబంధనను, ప్రమాణములను, వీరు తప్పక నెరవేర్చి, నిలుపుకొనునట్లును, పరిపూర్ణ ప్రేమ, సమాధానములందు వీరు నిత్యము నిలిచియుండి, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించునట్లును, అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయైన దేవుడు, మిమ్మును ఆశీర్వదించి, సంరక్షించి, కాపాడును గాక.
ప్రభువు మిమ్మును అనుగ్రహముతో కటాక్షించి, పరమందు మీరు నిత్యజీవము పొందుటకై, యిహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు, ఆత్మసంబంధమైన ప్రతి దీవెనతోను, వరములతోను, మిమ్మును నింపును గాక. ఆమేన్.
ప్రార్ధనలు – [ఇప్పుడు ఒక కీర్తన గాని, సంగీతము గాని పాడబడును. లేదా ఈ క్రింద యివ్వబడిన కీర్తనలు ఒకటి గాని, రెండు గాని వల్లించవచ్చును. లేదా పాడవచ్చును. అప్పుడు వధూవరులు ప్రభువు బల్ల యొద్దకు వెళ్ళుదురు]
[‘సప్తపద’ ఆను ఆచారమును అనుసరించిన యెడల, ప్రజలు 67వ కీర్తనలోని వచనములను ఒక్కొక్క దాని తరువాత ఆగుచు, వల్లించుచుండగా, లేదా పాడుచుండగా, వధూవరులు, ఒక్కొక్క అడుగు ముందుకు వేయుదురు]