పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 09 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /09

ఆదికాండము 9:1-17, 28,29

మరియు దేవుడు నోవహును, అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును, మీ బెదురును, అడవి జంతువులన్నిటికిని, ఆకాశపక్షులన్నిటికిని, నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చి యున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిగూర్చి ప్రతిజంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించువాని రక్తము, నరుని వలననే చిందింప బడును. ఏలయనగా, దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని, విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు, అతని కుమారులతో, ఇదిగో, నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతోకూడ నున్న ప్రతి జీవితోను, పక్షులేమి, పశువులేమి, మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి, ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువుల తోను, నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు, నాకును మీకును, మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య, నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు, ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును, మీకును, సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును, గనుక, సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి, దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు, నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య, నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

ఆ జలప్రవాహము గతించిన, తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినము లన్నియు, తొమ్మిది వందల ఏబది యేండ్లు. అప్పుడతడు మృతిబొందెను.

కీర్తనలు 42:1-11  [ప్రధాన గాయకునికి – కోరహు కుమారులు రచించినది. దైవ ధ్యానము]

దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. జనసమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో, నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి, స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా, నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.  నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.  నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది. కావున యొర్దాను ప్రదేశము నుండియు, హెర్మోను పర్వతము నుండియు, మిసారు కొండ నుండియు, నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని, కరడు (అల) కరడును (అలలును) పిలుచుచున్నది. నీ అలలన్నియు, నీ తరంగములన్నియు. నా మీదుగా పొర్లి పారియున్నవి.  అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు, నాకు తోడుగా ఉండును. కావున, నీవేల నన్ను మరచి యున్నావు? శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి, అని, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయు చున్నాను.  నీ దేవుడు ఏమాయెనని, నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త. నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను.

 

With this we can plan a schedule 📅 to complete whole Bible in one year. Let us read 📚 and grow in the Lord together. God bless you and keep you. మన తెలుగు ప్రజలకు దేవుడి వర్తమానం అందించుటకు ఈ వెబ్సైట్ క్రియేట్ చేయబడింది మీరు కూడా ఏదైనా షేర్ చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 08 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /08

ఆదికాండము 6:1-22

దేవుడు నోవహును, అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను, జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలును, ఆకాశపు తూములును, మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను. అప్పుడు నీళ్లు భూమిమీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. నూట ఏబది దినము లైన తరువాత నీళ్లు తగ్గిపోగా, ఏడవ నెల పదియేడవ దినమున, ఓడ అరారాతు కొండలమీద నిలిచెను. నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున, కొండల శిఖరములు కనబడెను. నలుబది దినములైన తరువాత, నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి, భూమిమీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు, అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున, తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు, గనుక, ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని, ఓడలోనికి తీసికొనెను. అతడు మరి యేడు దినములు తాళి, మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు, త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను, గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. అతడింక మరి యేడు దినములు తాళి, ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము, మొదటినెల తొలిదినమున, నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు, నీవును, నీతోకూడ నీ భార్యయు, నీ కుమారులును, నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతోకూడ  నున్న ప్రతిజంతువును, వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి, అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును, అతనితో కూడ అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి.  ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమిమీద సంచరించునవన్నియు, వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువు లన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను, కొన్ని తీసికొని, ఆ పీఠముమీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి, ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా, నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములును, వేసవి శీత కాలములును, రాత్రింబగళ్లును, ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

కీర్తనలు 40:1-10  [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]

యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి, నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు, ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను.  తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి, భయభక్తులుగలిగి, యెహోవా యందు నమ్మిక యుంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.  యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును, మాయెడల నీకున్న తలంపులును, బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా, అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైనవాడొకడును లేడు. బలులనైనను, నైవేద్యములనైనను, నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను, పాపపరిహారార్థ బలులనైనను, నీవు తెమ్మనలేదు.  అప్పుడు పుస్తకపు చుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన  ప్రకారము, నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక, మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని, నేను ఊర కుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను, నేను వెల్లడిచేసి యున్నాను. నీ కృపను, నీ సత్యమును, మహా సమాజమునకు తెలుపక, నేను వాటికి మరుగుచేయలేదు.

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 07 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /07

రోమీయులకు వ్రాసిన పత్రిక 5:1-11, 18-21, 6:1-4, 11-15, 21-23

కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు  ద్వారా, దేవునితో సమాధానము కలిగియుందము. (కొన్ని ప్రాచీన ప్రతులలో – కలిగియున్నాము అని పాఠాంతరము) మరియు ఆయన ద్వారా, మనము విశ్వాసము వలన, ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన, నిరీక్షణను బట్టి, అతిశయపడుచున్నాము. అంతే కాదు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను (శీలమును) కలుగజేయునని యెరిగి, శ్రమల యందును, అతిశయపడుదము. ఎందుకనగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ప్రేమ, మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. ఏలయనగా, మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు, యుక్త కాలమున, భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము, ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైన, ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు, మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా, ఆయన ద్వారా, ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా, శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా, మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల, సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుట చేత, మరి నిశ్చయముగా రక్షింప బడుదుము. అంతేకాదు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, మనము దేవునియందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము.

కాబట్టి, తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు, ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము, మనుష్యులకందరికిని, జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయత వలన, అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించునట్లు, ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను, పాపము మరణమును ఆధారము చేసికొని, యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, పాపమెక్కడ విస్తరించెనో, అక్కడ, కృప అపరిమితముగా విస్తరించెను.

ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి యుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము, ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మన మందరము, ఆయన మరణము లోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును, నూతన జీవము పొందినవారమై, నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన, మరణములో పాలుపొందుటకై, ఆయనతో కూడ పాతిపెట్టబడితివిు.

అటువలె మీరును, పాపము విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను, మిమ్మును మీరే యెంచుకొనుడి. కాబట్టి, శరీర దురాశలకు లోబడునట్లుగా, చావునకు లోనైన మీ శరీరమందు, పాపమును ఏలనియ్యకుడి. మరియు, మీ అవయవములను, దుర్నీతి సాధనములుగా (ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలోనుండి, సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని, ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన యెడల, కృపకే గాని, ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని, పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.

అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను, ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి, దేవునికి దాసులైనందున, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. ఏలయనగా, పాపమువలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము, మన ప్రభువైన క్రీస్తుయేసునందు, నిత్య జీవము.

కీర్తనలు 149:1-9

యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో, ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.  ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానినిబట్టి సంతోషించుదురు గాక. సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. తంబుర తోను సితారాతోను, ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.  యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై, తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.  వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రము లున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే. యెహోవాను స్తుతించుడి.

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 06 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /06

ఆదికాండము 6:1-3,5-14,17-22, 7:1,7,11,12

నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ, నరులతో ఎల్లప్పుడును వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై (శరీరులై) యున్నారు. అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.

నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు, ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులును, నరులతోకూడ జంతువులును, పురుగులును, ఆకాశ పక్ష్యాదులును, భూమిమీద నుండకుండ తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించి,  తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, తన హృదయములో నొచ్చుకొనెను.  అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు, అది చెడిపోయి యుండెను. భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.  దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది, గనుక, నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను, వెలుపటను, దానికి కీలు పూయవలెను.

ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను, ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు, భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతోకూడ నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును, ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు, సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలోనివి, రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై ,వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము, నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని, నీదగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

యెహోవా, ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని, గనుక, నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.

అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును, ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.

నోవహు వయసుయొక్క ఆరు వందల సంవత్సరము, రెండవ నెల పదియేడవ దినమున, మహాగాధజలముల ఊటలన్నియు, ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నలుబది పగళ్లును, నలుబది రాత్రులును, ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.

కీర్తనలు16:1-11[దావీదు రసిక కావ్యము]

దేవా, నీ శరణుజొచ్చియున్నాను. నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు. నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును. భూమి మీదనున్న భక్తులే శ్రేష్టులు. వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను. వారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము. నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదా కాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక, నేను కదల్చబడను. అందువలన, నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ (మూల భాషలో మహిమ) హర్షించుచున్నది. నా శరీరముకూడ సురక్షితముగా నివసించు చున్నది. ఎందుకనగా, నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. (లేక గోతిని చూడనియ్యవు) జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 05 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /05

ఆదికాండము 3:1-19

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే, తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి, దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై, దేవతలవలె ఉందురనియు, దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు, ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని, తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను. అప్పుడు, వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని, అంజూరపు ఆకులు కుట్టి, తమకు కచ్చడములను చేసికొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా, స్త్రీతో, నీవు చేసినది యేమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున, పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రదుకు దినములన్ని మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును, వైరము కలుగజేసెదను. అది (ఆయన) నిన్ను తలమీద కొట్టును. నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను.  ఆయన ఆదాముతో, నీవు నీ భార్యమాట విని, తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక, నీ నిమిత్తము నేల శపింపబడియున్నది.  ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినము లన్నియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు, నీ ముఖపు చెమట కార్చి, ఆహారము తిందువు. ఏలయనగా, నేలనుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

 

కీర్తనలు 34:1-22 [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు. అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలుచేయు వారెవరును లేరు. ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు, నా ప్రజలను మింగుచు, పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను, యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును. ఇశ్రాయేలు సంతోషించును.

 

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక | Day 04

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /04

ఆదికాండము 2:1-10,15-17

ఆకాశమును, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని, యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి, యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు, ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా, దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు, తన పని అంతటినుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా, భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమ్యాకాశములు సృజించబడినప్పుడు, వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే. అదివరకు పొలమందలియే పొదయు, భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు. ఏలయనగా, దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమినుండి లేచి, నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా, నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా, తూర్పున ఏదెనులో ఒక తోటవేసి, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు, దేవుడైన యెహోవా, చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. మరియు, ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి, అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.

మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని, ఏదెను తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును, దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున, నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

కీర్తనలు 34:1-22

[దావీదు అబీమెలేకు యెదుట వెర్రివానివలె ప్రవర్తించి, అతనిచేత తోలివేయబడిన తరువాత, రచించిన కీర్తన]

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణచేయగా, ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనతట్టు చూడగా, వారికి వెలుగు కలిగెను. వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా, యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలోనుండి, అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు, ఆయన దూత కావలియుండి, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి, ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?  మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?  చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను, కాచుకొనుము. కీడు చేయుట మాని, మేలు చేయుము. సమాధానము వెదకి, దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును, భూమిమీద నుండి కొట్టివేయుటకై, యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలోనుండి, వారిని విడిపించును. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు, అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక । Day 03

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /03

ఆదికాండము 1:6-28, 31

మరియు, దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు, ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా, ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా, రెండవ దినమాయెను. దేవుడు, ఆకాశము క్రిందనున్న జలము లొక చోటనే కూర్చబడి, ఆరిన నేల కనబడును గాకని పలుకగా, ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను, భూమి మొలిపించుగాకని పలుకగా, ఆ ప్రకార మాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా, మూడవ దినమాయెను. దేవుడు, పగటిని రాత్రిని వేరుపరచునట్లు, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు, అవి ఆకాశ విశాలమందు, జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును,  పగటిని, రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును, దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా, నాలుగవ దినమాయెను. దేవుడు, జీవముకలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు, జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటి నన్నిటిని, దాని దాని జాతి ప్రకారము, రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధిపొంది, సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా, అయిదవ దినమాయెను. దేవుడు, వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను, భూమి పుట్టించుగాకని పలికెను. ఆప్రకారమాయెను. దేవుడు, ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము, నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము. వారు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును, ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు, తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి, అభివృద్ధిపొంది విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరచు కొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

దేవుడు, తాను చేసినది యావత్తును చూచినప్పుడు, అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా, ఆరవ దినమాయెను.

కీర్తనలు  8:1-9

[ప్రధాన గాయకునికి – గిగీత్ (ద్రాక్ష గానుగ – గుడారముల పండుగ సందర్భము) రాగమును బట్టి పాడదగినది – దావీదు కీర్తన]

యెహోవా, మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను, పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి, బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు, స్తుతుల మూలమున, నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు. నీ చేతి పనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు, వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటె, వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో, వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికార మిచ్చియున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించువాటి నన్నిటిని, వాని పాదముల క్రింద నీవు ఉంచి యున్నావు. యెహోవా మా ప్రభువా భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక | Day 02

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /02

1 యోహాను 1:1-10; 2:1-14

1యోహా 1:1-10 = జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును, మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు, మేము చూచిన దానిని, వినిన దానిని, మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది. (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్ధము) మన (మీ అని పాఠాంతరము) సంతోషము పరిపూర్ణమవుటకై, మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని, మీకు ప్రకటించు వర్తమాన మేమనగా, దేవుడు వెలుగై యున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతోకూడ సహవాసము గలవారమని చెప్పుకొని, చీకటిలో నడిచినయెడల, మనమబద్ధమాడుచు, సత్యమును జరిగింపకుందుము.  అయితే, ఆయన వెలుగులోనున్న ప్రకారము, మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ప్రతి పాపము నుండి, మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక, ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతినుండి, మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

1యోహా  2:1-14 = నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, యీ సంగతులను మీకు వ్రాయు చున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది (ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు. (ప్రాయశ్చిత్తమైయున్నాడు) మన పాపములకు మాత్రమే కాదు. సర్వ లోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని, తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, వానిలో, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొను వాడు, ఆయన ఏలాగు నడుచుకొనెనో, ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయన యందున్నామని, దీని వలన తెలిసికొనుచున్నాము. ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని, క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ, మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక, అది, ఆయన యందును, మీయందును సత్యమే.       వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు, ఇప్పటి వరకును, చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు, వెలుగులో ఉన్నవాడు. అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు, చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డి తనము కలుగజేసెను గనుక, తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చిన్న పిల్లలారా, ఆయన నామము బట్టి, మీ పాపములు క్షమింపబడినవి గనుక, మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను. యౌవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక, మీకు వ్రాయు చున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని, ఎరిగి యున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను. యౌవ్వనస్థులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి యున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను.

కీర్తనలు  2:1-12

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి. వారి పాశములను మన యొద్దనుండి పారవేయుదము రండి, అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయు చున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములవరకు సొత్తు గాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగ గొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు, వారిని ముక్క చెక్కలుగా పగుల గొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి, భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దుపెట్టుకొనుడి. లేనియెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

 

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక  –  ఒక సంవత్సర (పన్నెండు నెలల) బైబిల్ క్యాలెండర్

పరిచయం

Start Reading Your Bible Today

ప్రతిరోజు కేవలం 5 నిముషాలు బైబిల్ చదువుకొని, ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తిచేయవచ్చు! 

ఇది స్పీడ్ యుగం. బైబిలు చదవాలని మనస్సులో ఉన్నప్పటికీ, సమయం కేటాయించలేక పోతున్నామని, కాల చక్రంలోని చాలామంది క్రైస్తవ విశ్వాసులు బాధపడుతుంటారు. వారి కోసమే ఈ యాప్. ప్రయాణాలలోనైనా, పని స్థలం, బడి లేదా కాలేజీలలో బ్రేక్ సమయంలోనైనా, బైబిలు చదువుకోవాలనుకొంటే, ఆ సమయంలో బ్యాగులో నున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడడానికి, కొందరికి బైబిలు హేళన చేయబడుతుందేమో నన్న భయం, మరి కొందరికి మొహమాటం. అలా సమయా భావం లేదా బిడియం గలవారి కోసం కేవలం 5 నిముషాలు మాత్రమే తీరిక చేసుకొని తమ మొబైల్ ఫోనులో చదివి, ఒక సంవత్సర కాలంలో బైబిలు పూర్తిచేయడానికి సహాయపడేదే ఈ యాప్.

లోకానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథాలు రెండే రెండు. మొదటి గ్రంథం దేవుని మహిమైశ్వర్యమును వివరించే సృష్టి కాగా, మానవాళి మేలు కొరకు తన ప్రవక్తలచే వివరించబడి, తరతరాలకు అందించబడిన రెండవ గ్రంథం బైబిలు. బైబిలు గ్రంథం కాలంతో నిమిత్తం లేని గ్రంథం. (Age less Book) అది రెండు ఖండాల భూభాగంలో విస్తరించి, మూడు భాషలలో, వందల మంది భక్తులచే, వేల సంవత్సరాల కాలంలో వ్రాయబడిన గ్రంథాల కూర్పు. వాస్తవానికి బైబిలు అను పేరుకు మూల నామమైన గ్రీకు భాషలోని ‘బిబ్లోస్’ అనే మాటకు ‘కాగితపు చుట్టలు’ అని అర్ధం. బైబిలు ఒక గ్రంథం కాదు. అది గ్రంథాల సమూహం. ఒక గ్రంథాలయం.

బైబిలు చదవడం యొక్క ప్రాముఖ్యత:

 బైబిలు చదవడం తప్పనిసరి:

బైబిలు చదవనవసరం లేదన్న మినహాయింపు ఎంతటి భక్తునికైనా, విశ్వాసికైనా లేనే లేదు. ‘మనమాయనయందు (దేవునియందు) బ్రదుకుచున్నాము. చలించుచున్నాము. ఉనికి కలిగియున్నాము. అటువలె, మన మాయన సంతానము’ (అ కా 17:28) ‘విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో’ (ఎఫె 1:18) తెలిసికొనులాగున మనకు జ్ఞానము కలుగుట కొరకు బైబిలు చదవడం తప్పనిసరి.

బైబిలులో నిత్యజీవమున్నది:

‘లేఖనములయందు, మీకు నిత్యజీవము కలదని తలంచుచు, వాటిని పరిశోధించుడి. అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి’ (యోహా 5:39) ‘క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా, రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు’ (2 తిమోతికి 3: 14-15)

బైబిలు ప్రయోజనకరమైనది: ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమై యున్నది’ (2 తిమోతికి 3:16-17) ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును’ (కీర్త 19:7)

బైబిలు దేవుని యందు భక్తి విశ్వాసాలను పెంచుతుంది:

‘వీరు (బెరయ సంఘములోని వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు, ఆలాగున్నవో లేవో అని, ప్రతి దినమును, లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత, వారిలో అనేకులును, ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను, చాల మందియు విశ్వసించిరి’ (అ కా 17:11-12)

కుటుంబ ప్రార్ధనలలో లేదా వ్యక్తిగతంగా ప్రతి రోజు, అనుకూల సమయంలో బైబిలు గ్రంథంలోని ఏదో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఒక సంవత్సర కాలంలో బైబిలు గ్రంథాన్ని పూర్తిచేయాని విశ్వాసులు అనుకొంటారు. బైబిలును ఒక గ్రంథాలయమని అనుకున్నప్పుడు, ఆ గ్రంథాలయంలోని గ్రంథాలను చదవడం ఎలా? కేటలాగు లేదా పుస్తకాల పట్టికను బట్టి మొదటి గ్రంథం నుండి అలా వరుసగా చివరివరకు బైబిలు చదవడం వలన అవగాహనలో యిబ్బంది కలుగవచ్చు. ఈ రోజు ఏ అంశం చదివితే బాగుంటుందని అనుకొంటూ, పేజీలు తిప్పి వెదకే అనుభవం కొందరు కలిగియుంటారు. అలా చదవడం వలన వారికి ఆసక్తి కలిగించిన వాక్య భాగం లేదా కీర్తన ఎన్నో మార్లు చదవబడి, కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు అనుభవం లోనికి రాకుండా పోతాయి. మరి యెలా చదివితే బాగుంటుంది?

అలాగున ఆలోచించే వారి కోసం బైబిల్ గ్రంథము కాలానుక్రమముగా (Chronologically) కూర్పుచేయబడి, పాత నిబంధన లేదా క్రొత్త నిబంధనలోని వాక్య భాగం మాత్రమే కాకుండా, దేవుని స్తుతించి, ఆరాధించే స్వభావం  కలిగిన దావీదు మహారాజు కీర్తలలలో ఒక కీర్తన గాని, కొంత భాగము గాని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఈ యాప్ సిద్ధం చేయబడింది. ఆత్మసంబంధమైన సౌందర్యం కలిగి, చదవగానే దాని భావాన్ని గ్రహించడం కష్టతరమైన సొలోమోను రచించిన పరమ గీతములు తప్ప ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అన్ని గ్రంథాలలోని లేఖన భాగాలు ఒక సంవత్సర కాలంలో చదువుకోవడానికి వీలుగా ఈ యాప్ సంకలనం చేయబడింది.

ఒక దినం, 24 గంటలలో కేవలం ఐదు నిముషాలు మాత్రమే వినియోగించి, బైబిలులో యిమిడి యున్న జీవితానికి కావలసియున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ధన్యతలు, హెచ్చరికలు పొందుకొనునట్లుగా ఒక సంవత్సర కాలములో బైబిలులోని అన్ని గ్రంథాలను ధ్యానం చేయడానికి ఈ యాప్ సహాయం చేస్తుంది. సమయం అనుకూలించినప్పుడు, ఆ రోజుకు ప్రస్తావించబడిన వాక్య భాగాన్ని తమ బైబిలులో మరింత విస్తృతంగా చదువుకోవచ్చు. అలాగున దేవుని కొరకైన తమ తృష్ణను సంపూర్ణముగా తీర్చుకోవచ్చు.

ఈ యాప్ బైబిలు గ్రంథం యొక్క సంగ్రహం (Summary) కాదు. బైబిలు గ్రంథానికి ప్రత్యామ్న్యాయం కాదు. బైబిలు గ్రంథములో యిమిడియున్న అపారమైన సంపదలో కేవలం కొంతమేరకు సంగ్రహించడానికి ఒక భక్తుడు చేసిన ప్రయత్నం మాత్రమే.

‘మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన, క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును గాక. ఆమేన్! (ఎఫె 1: 17-19)

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక | Day-1

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /01 రొజు

ఆదికాండము 1:1-5; యోహాను సువార్త 1:1-18

ఆది 1:1-5 =  ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు, వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా, ఒక దినమాయెను.

యోహా 1:1-18 = ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆయన, ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్న దేదియు, ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు, అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని, ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు, అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోక మాయన మూలముగా కలిగెను గాని, లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు, ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు, ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను, పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా, మనమధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన, అద్వితీయకుమారుని (లేక జనితైక కుమారుని) మహిమవలె, మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్య మిచ్చుచు, నా వెనుక వచ్చువాడు, నాకంటె ప్రముఖుడు గనుక, ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు, ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి, మనమందరము, కృప వెంబడి కృపను పొందితివిు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అను గ్రహింపబడెను. కృపయు సత్యమును, యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును, ఎప్పుడైనను, దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే (లేక జనితైక కుమారుడే) ఆయనను బయలు పరచెను.

 

కీర్తనలు  19:1-14  [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు. మాటలులేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది. లోక దిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి.  వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు, పెండ్లి కుమారునివలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు, తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి, ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోష పరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. తేనెకంటెను, జుంటితేనె ధారలకంటెను, మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి, నన్నునిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనియ్యకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై, అధిక ద్రోహము చేయకుండ నిందారహితుడనగుదును. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును, నా హృదయ ధ్యానమును, నీ దృష్టికి అంగీకారములగును గాక.