సిలువ నేర్పే పాఠం Lesson from CROSS -GOOD FRIDAY EASTER MESSAGE


సిలువ నేర్పే పాఠం – ‘కీడుకు ఎదురాడకుము’
ప్రభువు పరిచర్య కాలంలోగాని, ఆయన అప్పగింపబడిన తరువాత మహాసభ వద్ద విచారణ, రోమా ప్రభుత్వ విచారణ, ఆపై మరణ శిక్ష విధింపబడి సిలువపై వ్రేలాడి మరణించినప్పటి వరకు ఆయన బోధించి, అనుసరించిన విధానం ఒక్కటే. ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక ‘కీడుకు ఎదురాడకుము’ (1881 తెలుగు బైబిలు) Resist not evil.
ప్రభువు ఐచ్చికంగా శ్రమలను సహించాడు. దావీదు మహారాజు, యెషయామరియు యెందరో ప్రవక్తల ద్వారా ప్రభువుకు యెదురయ్యే శ్రమలుమరియు ఆయన ప్రవర్తించబోవు తీరును గూర్చి అనేకమైన ప్రవచనాలు బైబిలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. వ్రాయబడిన వాటి సారాంశం అన్నట్లుగా ప్రవక్తయైన యెషయా ప్రవచనాన్ని చూడవచ్చు.
‘అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని యెదుట గొర్రెయు, మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు. (యెష 53:7)
ప్రభువు స్వచ్చందంగా శ్రమలను సహిస్తాడన్న ప్రవచనాల నెరవేర్పు అన్నట్లుగా అపొస్తలుల సాక్ష్యం క్రొత్త నిబంధనలో యిలాగు వ్రాయబడింది. ‘ఆయన గొర్రెవలె, వధకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని యెదుట, గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో, ఆలాగే, ఆయన నోరు తెరవకుండెను.’ (అ కా 8:32)
క్రీస్తు సంఘానికి బండ అని చెప్పబడిన ఆపో. పేతురు మాటలలో: ‘ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ, మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను, ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమపెట్టబడియు, బెదిరింపక, న్యాయముగా తీర్పుతీర్చు దేవునికి, తన్ను తాను అప్పగించుకొనెను.’ (1 పేతు 2:21-23)
ప్రభువు సహనంమరియు ఓర్పులకు మూలం ఒక్కటే! ‘దుష్టుని ఎదిరింపకుము!’ లేక ‘కీడుకు ఎదురాడకుము!’
‘కీడుకు ఎదురాడకుము!’ అని ప్రభువు పలికిన మాటలో గొప్ప మర్మం దాగియుంది. అది నిత్య రాజ్యానికి ఖచ్చితంగా చేరుకునే మార్గానికి సూచిక వంటిది. అపవాది ఉచ్చులలో చిక్కుబడిపోకుండా అది కాపాడుతుంది. యిరుకు దారిలోనే ప్రయాణం చేసేలా సహాయం చేస్తుంది. విశాల మార్గం వైపుకు తిరుగకుండా నిలువరిస్తుంది. ‘క్షణభంగురమైన జీవితం’ ‘బుడగ ప్రాయమైన జీవితం’ బ్రష్టత్వంలోకి జారిపోకుండా కాపాడుతుంది. శరీరమనే గుడారంలో నివసించే దేవుని ఆత్మ స్వరూపులైన మానవులు నిత్య నాశనంలోనికి దిగిపోకుండా సహాయం చేస్తుంది. నాశనానికి కారకుడైన అపవాది మధ్యలో పుట్టి మధ్యలో పోయేవాడే. తిరుగుబాటు చేసిన అపవాదికి మనుష్యులను ప్రేరేపించగల శక్తి కలిగినందున, సాతాను కూడ తన ప్రభావాన్ని చూపుతుంది గాని, అది తాత్కాలికమే. అంతిమ విజయం దేవునిదే. సర్వలోకం సృష్టికర్తచే సృజింపబడింది. సృష్టి అలాగే సర్వ జీవుల కాలగతులు సృష్టికర్త స్వాధీనంలో ఉన్నాయి. దేవుని రాజ్యం నిత్యం నిలుస్తుంది.
‘యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుష్షుకును మూలమైయున్నాడు.’ (ద్వితీ 30:20) ‘ఆయన కాలములను, సమయములను, మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు, నియమించుచు, ఉన్నవాడు.’ (దాని 2:21) ఆయన యెహోవా దేవుడు, అనగా, నిత్యమైనవాడు, నిన్న నేడు రాబోవు కాలం ఉన్నవాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, భూమ్యాకాశములు తన స్వాధీనంలో గల ఏలోహీమ్ (Elohim). జీవమరణములు దేవుని వశము. మరణం విషయంలో బైబిలు గ్రంథం చాలా స్పష్టంగా వివరించింది. ‘మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.’ (ప్రక 1:18) ‘ఆత్మను విడవకుండా వుండుటకు తన ఆత్మ మీద మనుష్యుడు అధిపతి కాడు. మరణ దినము మీద వానికి అధికారమున్ను లేదు. ఆ యుద్ధమందు ఆయుధములను తీసివేసుట లేదు.’ (ప్రసం 8:8 – 1881 తెలుగు బైబిలు) ‘ఆత్మను చంపనేరక, దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను, దేహమును కూడ నరకములో నశింపజేయగల వానికి, మిక్కిలి భయపడుడి.’ (మత్త 10:28) ‘మీ తండ్రి సెలవు లేక, వాటిలో (రెండు పిచ్చుకలలో) ఒకటైనను నేలను పడదు. … గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. (మత్త 10:29,31)
ఈ వాక్యాలన్నిటిని ఋజువు చేస్తూ నీతిమంతుడైన యోబు విషయంలో దేవుడు అపవాదితో యిలాగు పలికాడు: ‘ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. … అతడు నీ వశమున నున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు.’ (యోబు 1:12; 2:6)
పై వాక్యాలను గమనించినప్పుడు దేవుని సెలవు లేనిదే నరుల జననం కాని మరణం గాని జరుగలేవు. సిలువపై ప్రభువు మరణించినప్పుడు ఆయనను ఎవరూ చంపలేదని, స్వచ్చందంగానే ఆయన తన ప్రాణం పెట్టాడని ప్రభువు స్వయంగా ప్రకటించాడు.
‘ఎవడును నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాని తిరిగి తీసికొనుటకును, నాకు అధికారము కలదు.’ నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని.’ (యోహా 10:18) అది ఒక్క దేవునికే సాధ్యం. ప్రభువు పిలాతుతో చెప్పిన మాట అదే. ‘పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప, నా మీద నీకు ఏ అధికారమును ఉండదు.’ (యోహా 19:11)
వీటన్నిటిని బట్టి ఒక సంగతి గ్రహించవచ్చు. లోకంలో నరులు శ్రమలపాలైనా, అపవాది తంత్రాలకు నరుల జీవితాలు ఛిద్రమైనప్పటికీ, లోకయాత్ర ముగింపు సమయంలో ‘ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.’ (ప్రసం 12:7) ‘నా కాలగతులు నీ వశములో నున్నవి.’ (కీర్త 31:15) ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ (లూకా 23:46;) ‘యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము’ (అ కా 7:59) అని ప్రతి జీవి చెప్పాల్సిందే. సమస్త శరీరాత్మల మనుగడ దేవునిలోనే. అపవాదికి మరణంపై అధికారం లేదు. ఈ కారణం చేతనే లోకంలో జీవిస్తున్న వారికి ప్రభువు ప్రకటించాడు. ‘లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి యున్నాను.’ (యోహా 16:33) ‘క్రీస్తు, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచి పోయెను.’ (1 పేతు 2:21) ఆ మాదిరి ఏదనగా, ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక ‘కీడుకు ఎదురాడకుము’
‘లోకములో మీకు శ్రమ కలుగును’ అని ప్రభువు పలికినట్లుగా లోకంలో ప్రభువుకు శ్రమలు వచ్చాయి. శ్రమల సమయంలో ఆయన తండ్రికి ప్రార్ధన చేశాడు. ‘నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్ద నుండి తొలగి పోనిమ్ము. అయినను, నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము’ (మత్త 26:39) ‘నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము. అయినను, నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము’ (మార్కు 14:36) ‘తండ్రీ, యీ గిన్నెనాయొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము. అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.’ (లూకా 22:43)
ఆలాగున ప్రార్ధించిన ప్రభువుకు ముమ్మారు ప్రార్ధించిన ఆపో. పౌలువలె, జవాబు వచ్చింది. ‘నా కృప నీకు చాలును’ (2 కొరిం 12:9) ‘అప్పుడు పరలోకమునుండి, యొక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరచెను.’ (లూకా 22:44) ఆ తరువాత దేవుని చిత్తాన్నెరిగిన ప్రభువు యిలాగు ధైర్యంగా పలికాడు: ‘తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా’ (యోహా 18:11)
విచారణమరియు సిలువ వేయబడిన సమయంలో ప్రభువు కీడును కీడుతో ఎదిరించకుండా, కీడును ధైర్యంగా సత్యముతో ఎదుర్కొని విజయుడయ్యాడు. ఆయన విజయం ఆ క్షణమే ప్రకటించబడింది. ప్రభువుకు శిక్ష విధించిన పిలాతు యిలాగు పలికాడు. ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. (మత్త 27:24) శిక్ష అమలు చేసినప్పుడు జరిగినది చూచిన శతాధిపతి ప్రకటించాడు: ‘ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి, దేవుని మహిమపరచెను.’ (లూకా 23:47) ‘శతాధిపతియు, అతనితో కూడ, యేసునకు కావలి యున్నవారును, … నిజముగా, ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.’ (మత్త 27:54) ‘ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి, ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, అని చెప్పెను.’ (మార్కు 15:39)
శ్రమ పడటం దేవుని చిత్తమైనప్పుడు, శ్రమలలో విశ్వాసిదే విజయం. ‘ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు, న్యాయము జరుగుననియు, జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.’ (ప్రసం 8:5) శ్రమలు కలిగినప్పుడు, దేవునికి యెడతెగక ప్రార్ధించడం మొదటి చర్య. ఆ ప్రార్ధన ఎలా చేయాలో ప్రభువు నేర్పించాడు. ‘మమ్మును శోధనలోకి తేక, దుష్టునినుండి (కీడునుండి) మమ్మును తప్పించుము.’ (మత్త 6:13) ప్రార్ధించినప్పటికీ, శోధన కొనసాగినట్లయితే, శోధనలను సహించడాని శక్తి నిమిత్తం ప్రార్ధించడం రెండవ చర్య. ఆ తరువాత, ‘తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచిపోయిన’ యేసును అనుసరించి, శ్రమల లోయలో ప్రయాణించడం విశ్వాసియొక్క మూడవ చర్య. ‘గాఢాంధకారపు (మరణాంధకారపు) లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కఱ్ఱయు, నీ దండమును, నన్ను ఆదరించును.’ (కీర్త 23:4) [దుడ్డు కఱ్ఱ: Rod, హెబ్రీ: షెబెత్, సరిదిద్దుటకు లేక పాలించుటకు, దండము: staff, హెబ్రీ: మిష్హాన్, ఆనుకొనుటకు] ‘ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడ ఉన్నాను’ (మత్త 28:20) దేవుని సన్నిధిలో జీవించేవారికి ప్రభువు తన మార్గాన్ని బోధించాడు:
‘నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము.’ (మత్త 5:39) ‘కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు’ (రోమీ 12:17) ‘కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు. యెహోవాకొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును.’ (సామె 20:22) ‘ఇదిగో మీరు శోధింపబడునట్లు, అపవాది (అనగా సాతాను) మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. పది దినములు శ్రమ కలుగును. మరణమువరకు (అనగా ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. (ప్రక 2:10)
సిలువ నేర్పే పాఠం యిదే! ‘కీడుకు ఎదురాడకుము’ నేను విజయం సాధించి మీకు మాదిరి చూపించాను అని ప్రభువు ప్రకటించాడు. ‘శిష్యుడు తన బోధకునివలెను, దాసుడు తన యజమానునివలెను, ఉండిన చాలును. (మత్త 10:25) ‘నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరును నన్ను పోలి నడుచుకొనుడి.’ (1 కొరిం 11:1) అని ఆపో. పౌలు పలికాడు.
ప్రభువు సిలువ నేటికీ అదే బోధిస్తున్నది. ‘లోకములో మీకు శ్రమ కలుగును’ ‘కీడుకు ఎదురాడకుము!’ అయితే, విశ్వాసులకు అనుమానం కలిగేలాగా పరి. యాకోబు వ్రాసిన పత్రికలో యిలాగు వ్రాయబడింది.
‘అపవాదిని (సాతానును) ఎదిరించుడి’ (యాకో 4:7) రెండు హెచ్చరికలు భిన్నంగాను ఒక దానికి ఒకటి విరుద్ధంగాను కనబడతాయి. అయితే, రెండు విధాలు కూడ సరియైనవే. క్రీస్తు ప్రభువు చెప్పింది కూడ అదే. ‘దుష్టుని (అపవాదిని) దుష్టత్వంతో ఎదిరింపక ‘ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొని’ (ఎఫె 6:13) అపవాదిని (సాతానును) ఎదిరించండి’.
‘మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని, నిలువబడుడి. ఇవన్నియు గాక, విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో, మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలన, ప్రతి సమయమునందును, ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, మెలకువగా ఉండుడి.’ (ఎఫె 6:14-18)
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో పిరికితనంతో లేదా భయపడుతూ ఆయన జీవించ లేదు. వాక్యమనే ఖడ్గాన్ని ఉపయోగించి సాతాను నోరు మూయించాడు. వాస్తవానికి వాక్యమంటే ఆయనే.
‘ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా, మనమధ్య నివసించెను.’ (యోహా 1:1,14) ‘ఆయన నామము దేవుని వాక్యమనబడియున్నది.’ (His name is called The Word of God.) (ప్రక 19:13) అందుకే దేవుని వాక్యము, యెహోవా వాక్యము అనబడిన కుమారుడైయున్న దేవుని దావీదు కీర్తించాడు. ‘దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను.’ (కీర్త 56:10)
‘తన వాగ్దండము చేత లోకమును కొట్టును.’ (యెష 11:4) అని యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా, నరావతారియైన దేవుని వాక్యం తన మాటలతో అందరి నోర్లు మూయించడమే కాదు. అట్టి వాక్యమైయున్న ప్రభువు శాస్త్రులకు పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు, ప్రజలకు, చివరికి వ్యాపారం చేసేవారికి ఎప్పుడూ భయపడలేదు. సందర్భాన్ని బట్టి లేఖన భాగాలను వారికి గుర్తుచేసి, వాక్యంతో శాస్త్రులకు పరిసయ్యులకు జవాబు చెప్పాడు. వారి లోపాలను ఎత్తి చూపాడు. వారు ఆయనను కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించి నప్పుడు మాత్రం తనను బట్టి వారు పాపం మూటగట్టుకోకుండా, ఆయన ఆ ప్రాంతం నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులుమరియు ప్రజలందరి సమక్షంలోనే దేవాలయంలో వ్యాపారం చేసేవారి బల్లలు పడద్రోసి, వారిని తరిమివేశాడు.
గలిలయ ప్రాంతంలో యేసు ప్రభువు పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన యొద్దకు పరిసయ్యులు వచ్చి, హేరోదు (యోహానును చెరలో వేసి, తలగొట్టించిన హేరోదు రాజు) నిన్ను చంపాలని అనుకొంటున్నాడు, నువ్వు పారిపో అని చెప్పారు. వారి ఆలోచన హేరోదునుండి ఆయనను రక్షించాలని కాదు. గలిలయనుండి యెరూషలేముకు ఆయన వెళితే, ఆయనను వారే అక్కడ చంపవచ్చునని. వారి ఆంతర్యం ఎరిగిన క్రీస్తు ప్రభువు అటు హేరోదు అలాగే పరిసయ్యుల నక్క వేషాలు బయటపెట్టే విధంగా మాట్లాడాడు. (గ్రీకు భాషలో ఆడు నక్కనే నక్క అని పిలుస్తారు. నక్క చాలా హేళనైన మాట. పిరికితనానికీ, జిత్తులమారితనానికీ, వంచనకు, తంత్రాలకు, తుంటరితనానికి, దుశ్చేష్టలకు మారు పేరు నక్క. ‘మీరు సింహానికి తోకగానైనా ఉండండి గాని నక్కలకు తలగా మాత్రం కాదు అనేది యూదులలో ఒక సామెత) యేసు ప్రభువు యిలాగు జవాబిచ్చాడు: ‘మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను’ (లూకా 13:32) ఈ మాటలలో హేరోదు రాజంటే భయంలేదు. తాను నివసించిన గలిలయ ప్రాంతానికి అధిపతిగా ఉన్న హేరోదు రాజును ‘ఆ నక్కతో ఈలాగు చెప్పుడి’ అని బహిరంగంగా అందరూ వింటుండగా మాట్లాడాడు. హేరోదు రాజు పాలనా ప్రాంతమైన గలిలయలో యింకా రెండు రోజులు ఉండి, నా పని కొనసాగిస్తాను. నన్ను అతడు భయపెట్టలేడు, ఆటంకపరచలేడు. నా యిష్ట ప్రకారం, నా ప్రణాళిక ప్రకారమే నేను కొనసాగిస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు గాని, పరిసయ్యుల చెవులు మందమైనవి గనుక వారు గ్రహింపలేదు.
సిలువవేయబడుటకు యేసు ప్రభువు అప్పగింపబడక ముందు, యూదా ప్రజల పక్షంగా ప్రధాన యాజకుని సమక్షంలో యేసు ప్రభువును రోమా గవర్నరు పిలాతు ప్రశ్నించినప్పుడు ‘ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.’ (మత్త 27:14; మార్కు 15:5) ఒక తీర్పుతీర్చు అధికారి అడిగిన ప్రశ్నలకు జవాబు యివ్వకపోవడం ఖచ్చితంగా తిరుగుబాటే. దానికి లోకరీతిగా చాలా ధైర్యం కావాలి. ఆయన ప్రేమాస్వరూపి. ‘ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది’ (1 యోహా 4:18)
యేసు ప్రభువు ధైర్యానికి మరొక ఉదాహరణ: ప్రధానయాజకుడు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు జవాబు చెప్పుచున్నప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి, యేసును అరచేతులతో కొట్టాడు. అందుకు యేసు ప్రభువు, ‘నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావు? అని బంట్రోతును నిలదీశాడు. (యోహా 18:22,23) ఆయన ఆ మాట పలికింది వాడు కొట్టిన దెబ్బల మూలంగా తన శరీరానికి కలిగిన బాధ వలన కానేకాదు. వాడు తన విధి ధర్మం పాటించనందుకు మాత్రమే.
ప్రభువు ఆచరించిన విధానం ‘సాత్వీకపు లేదా నిష్క్రియతో కూడిన విధేయత.’ (doctrine of passive obedience) అనగా ఆజ్ఞాపించబడిన పని ఎదిరించకుండా విధేయతతో చేయకపోవడం. చాలా మంది అనుకొంటున్నట్లుగా అట్టి విధేయత లోకంలోని దుష్టత్వానికి తలవంచి లోబడటం కాదు. అపవిత్రతకు పిరికివాని వలె లొంగిపోవడం కాదు, దుష్టత్వానికి భయపడి లోబడటం కాదు. ఆయా సందర్భాలలో ప్రభువు చేసింది, నిష్క్రియతోమరియు విధేయతతో లోబడే సిద్ధాంతం కాదు. అది సాత్వీకం లేదా నిష్క్రియతో ఎదిరించే సిద్ధాంతం. అది మానవజాతి నైతిక శాస్త్రానికి మొట్టమొదటి సారిగా క్రీస్తు ప్రభువు అందించిన క్రొత్త సిద్ధాంతం. క్రీస్తు ప్రభువు జీవితాన్ని బట్టి అందలి భావం స్పష్టంగా గ్రహించవచ్చు.
మనుష్యులకు తమ జీవిత కాలమంతటిలో ఏర్పడే శత్రువుల సంఖ్య కంటే తన స్వల్పమైన జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువుకు చాలా ఎక్కువ మంది శత్రువులుగా నున్నారు. ఆయనపై శత్రువుల ద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే, ఆయనను చంపివేయడం తప్ప మరి ఎట్టి కార్యమూ వారిని తృప్తిపరచలేదు. అయినా, తాను ఎంచుకొన్న మార్గం ఎంత ప్రమాదకరమైనదో యేసు ప్రభువుకు తెలుసు. వ్యతిరేకించే వారికి ఆయన లోబడినట్లయితే, అట్టి ప్రమాదాన్నుండి తప్పించుకోవచ్చు గాని, ఒక్కసారి కూడ ఆయన అలా లోబడలేదు. ఆయన జీవిత పర్యంతం అధికారులుమరియు పెద్దల వలన ఏర్పడిన పరిస్థితులపై లోబడిన జీవితం కాదు గాని తిరుగుబాటుగానే ఉండేది. సత్యాన్ని బట్టి ఆయన వ్యతిరేకత పరిచర్య ఆరంభ దినాల నుండి సిలువ మరణ పర్యంతం అలాగే నిలిచింది. ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక కీడుకు ఎదురాడకుము’ అనగా ‘దుష్టుని దుష్టత్వంతో ఎదిరింపకుము’ ‘కీడును కీడుతో ఎదిరించవద్దు’ అనేది ప్రభువు పోరాట విధానం. బలప్రయోగంతో బల ప్రయోగాన్ని ఎదిరింపవద్దు. దూషణను దూషణతోను, నిందను నిందతోను ఎదుర్కోవద్దు. దుష్టత్వానికి లోనుకాకుండా చెడును మంచితో జయించి, దూషణను మంచి మాటలతోను, నిందను మౌనంతోను ఎదుర్కోవడం. యేసుక్రీస్తు ప్రభువు ఒక కత్తిని గాని ఈటెను గాని తనతో ఉంచుకోలేదు, శిరస్త్రాణం గాని కవచం గాని ధరించలేదు, కాళ్ళకు యిత్తడి తొడుగులు లేవు గాని వీటన్నిటిని మించిన రక్షణ ఆయుధాలను ఆయన ధరించాడు. మనుష్యుల మధ్య వివాదాలను పరిష్కరించగల ఆయుధం ఆయన ధరించాడు. నిజమైన విజయం సాధించ గలిగిన ఆ ఒకే ఒక్క పద్ధతిని ఆయన వినియోగించాడు. యూదుల మూర్ఖత్వాన్ని సహనంతో భరించాడు. రోమీయుల క్రూరత్వం యెదుట యూదుల మానవత్వ ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు. యూదుడైన ఆయన తనను అతిగా ద్వేషించిన యూదులుమరియు రోమీయుల సంఘటిత శక్తికి ఒంటరిగా ఎదురొడ్డాడు. రోమీయుల శక్తి ఆయనను ఏమీ చేయలేక పోయింది.
యేసుక్రీస్తు ప్రభువు దేహాన్ని సీజరు చంపగలిగాడు అని అనుకున్నప్పటికీ, ఆ పై ఆయనను యింకా ఏమీ చేయలేక పోయాడు. రోమీయులు ఆయనను చంపిన తరువాత, యేసు క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై రోమా సామ్రాజ్యపు పునాదులను కదిలించాడు. రోమా రాజ్య పరిపాలనా నిబంధనలనుమరియు చరిత్ర గతిని మార్చివేశాడు.
‘కీడుకు ఎదురాడకుము’ క్రీస్తు యేసు ప్రభువు చూపిన మాదిరిని బట్టి ఆది సంఘం యజమానుని పోలి నడుచుకుంది. వారు ఎవరినీ శత్రువుగా భావించలేదు. యూదుల వ్యతిరేకతకు వారు ఆత్మ సంయమం పాటించారు. వారు సైన్యానికి భయపడలేదు; రాజుల యెదుట ధైర్యంగా నిలబడ్డారు; హింసను లెక్కచెయ్యలేదు. శరీర బాధలకు మౌనసమ్మతి తెలిపారు. తమ విశ్వాస మార్గంలో తమను ఎదిరించువారిని నిందించక, ప్రభువు నిమిత్తం సంతోషంగా హత సాక్ష్యులయ్యారు. ఆలాగున మహిమ రాజ్యానికి వారసులయ్యారు.
చరిత్ర గమనించినట్లయితే, రోమీయుల అధికారంపై బలప్రయోగంతో కూడిన యూదుల ప్రతిఘటన మూలంగా లక్షలాది మంది యూదులు చనిపోయారు. లక్షలాది మంది యూదులు దౌర్భాగ్య స్థితిలోనికి నెట్టబడ్డారు. యూదులు రోమా పాలనను పోరాటం ద్వారా ప్రతిఘటింపగా, క్రైస్తవులు మౌనంగా సహనంతో ప్రతిఘటించారు. రోమీయుల క్రూరత్వం యూదులకంటే క్రైస్తవులకు మరి ఎక్కువ హేయమైనది. అయినా క్రైస్తవ విశ్వాసులు తమను ద్వేషించేవారిని చంపాలని అనుకోలేదు, వారిని మార్చాలనుకొన్నారు. ఆది సంఘంలోని క్రైస్తవులు రోమీయుల విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ, వారిపై తిరిగి పోరాటం చేయలేదు. సత్యాన్ని గ్రహించి, క్రీస్తు ప్రభువును ఆరాధించాలని వారికి బోధించారు. తమ ఆగ్రహాన్ని క్రైస్తవులు మౌనంగా సహించడం రోమీయులు చూచి నప్పుడు, వారి ఆగ్రహం అభినందన, ప్రేమమరియు ఆరాధనగా మారింది. కాలక్రమంగా క్రైస్తవ మతం రోమా సామ్రాజ్య మతంగా అవతరించింది. రోమీయులతో క్రైస్తవుల వైరాన్ని బట్టి కలిగిన ప్రాణ నష్టం యూదులతో పోలిస్తే ఎక్కువ కాదు. కోజిబా (యూదులను సమీకరించి తిరుగుబాటు చేసినవాడు) తిరుగుబాటు వల్ల ఒక్క సంవత్సరంలో జరిగిన యూదుల ప్రాణ నష్టంతో పోలిస్తే, మూడు వందల సంవత్సరాలలో రోమీయులచే చిత్రహింసల వలన చనిపోయిన క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ. ఆయుధం మూలంగా చనిపోయిన ప్రతి యూదుడు మరి యెక్కువ శత్రువులను తయారుచేసుకొన్నాడు. నిరాయుధుడై చనిపోయిన ప్రతి క్రైస్తవ విశ్వాసి స్నేహితులను సంపాదించాడు. అందుకొరకే హతసాక్షులైన క్రైస్తవుల రక్తమే సంఘం మొలకెత్తుటకు విత్తనంగా మారిందనే ఉపమానం వచ్చింది. క్రీస్తు ప్రభువు చరిత్ర అలాగే క్రైస్తవ సంఘ ఆవిర్భావం, క్రీస్తు ప్రభువు బోధించిన విధానానికి సాక్ష్యంగా నిలిచింది.
‘ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి.’ (ఎఫె 6:10,11) ‘నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.’ (ఎఫె 5:11) ‘సాతాను మనలను మోసపరచకుండునట్లు, .. వాని తంత్రములను మనము ఎరుగని వారము కాము.’ (2 కొరిం 2:11) ‘నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించుడి.’ (1పేతు 5:8,9) ‘దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే’ (రోమా 8:33)
ప్రభువు సిలువ సందేశం నేటికీ అదే! ‘లోకంలో మీకు శ్రమ కలుతాయి’ ‘కీడుకు ఎదురాడవద్దు!’
‘అపవాది తంత్రాలకు లోబడవద్దు!’ ‘నేను లోకాన్ని జయించాను’ ‘నీవును నేనిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించి లోకాన్ని జయించు!’ ‘జీవ కిరీటం పొందుకో! ఆమేన్!

Leave a Comment