పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 09 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /09

ఆదికాండము 9:1-17, 28,29

మరియు దేవుడు నోవహును, అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును, మీ బెదురును, అడవి జంతువులన్నిటికిని, ఆకాశపక్షులన్నిటికిని, నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చి యున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిగూర్చి ప్రతిజంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించువాని రక్తము, నరుని వలననే చిందింప బడును. ఏలయనగా, దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని, విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు, అతని కుమారులతో, ఇదిగో, నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతోకూడ నున్న ప్రతి జీవితోను, పక్షులేమి, పశువులేమి, మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి, ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువుల తోను, నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు, నాకును మీకును, మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య, నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు, ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును, మీకును, సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును, గనుక, సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి, దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు, నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య, నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

ఆ జలప్రవాహము గతించిన, తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినము లన్నియు, తొమ్మిది వందల ఏబది యేండ్లు. అప్పుడతడు మృతిబొందెను.

కీర్తనలు 42:1-11  [ప్రధాన గాయకునికి – కోరహు కుమారులు రచించినది. దైవ ధ్యానము]

దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. జనసమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో, నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి, స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా, నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.  నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.  నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది. కావున యొర్దాను ప్రదేశము నుండియు, హెర్మోను పర్వతము నుండియు, మిసారు కొండ నుండియు, నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని, కరడు (అల) కరడును (అలలును) పిలుచుచున్నది. నీ అలలన్నియు, నీ తరంగములన్నియు. నా మీదుగా పొర్లి పారియున్నవి.  అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు, నాకు తోడుగా ఉండును. కావున, నీవేల నన్ను మరచి యున్నావు? శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి, అని, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయు చున్నాను.  నీ దేవుడు ఏమాయెనని, నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త. నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను.

 

With this we can plan a schedule 📅 to complete whole Bible in one year. Let us read 📚 and grow in the Lord together. God bless you and keep you. మన తెలుగు ప్రజలకు దేవుడి వర్తమానం అందించుటకు ఈ వెబ్సైట్ క్రియేట్ చేయబడింది మీరు కూడా ఏదైనా షేర్ చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి

Leave a Comment