బాలింతలు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట
[ఈ కృతజ్ఞతాస్తుతి సంఘము యొక్క బహిరంగ ఆరాధనలో ఒక దానియందు చెల్లించబడవలెను, పాత నిబంధన కీర్తనను, ప్రభువు ప్రార్ధనను చెప్పునప్పుడు సంఘము కలిసి చెప్పవచ్చును. తల్లియు, తండ్రియు, కొత్తగా పుట్టిన బిడ్డను తీసికొని, పరిశుద్ధ బల్ల యెదుట గాని, లేక వీలయిన మరియొక చోట మోకరించవలెను. గురువు వారికి అభిముఖుడై యిట్లు చెప్పును]
సర్వశక్తిగల దేవుడు మీకొక బిడ్డను దానముగా యిచ్చుట వలన, మీయందెంతో దయగలవాడై యున్నాడు. కనుక మనము ఆయనకు కృతజ్ఞతా వందనములు చెల్లించుదము.
[గురువును తలిదండ్రులును సంఘముతో కలిసి, ఈ క్రింది పాత నిబంధన కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చెప్పుదురు: కీర్తన 145:1-8]
కీర్తన 145:1-8: 1. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను.
2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.
3. యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.
4. ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు.
5. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను, నేను ధ్యానించెదను.
6. నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
7. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు.
8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు. కృపాతిశయము గలవాడు.
తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక.
ఆదియందు, యిప్పుడు, ఎల్లప్పుడు ఉండునట్లు, యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.
ప్రార్ధించుదము. ప్రభువా మమ్మును కనికరించుము.
క్రీస్తూ మమ్మును కనికరించుము.
ప్రభువా మమ్మును కనికరించుము.
(గురువు దిగువ ప్రార్ధన చెప్పును)
సర్వశక్తి గల ఓ దేవా, ఈ నీ సేవకురాలికి సంతోషకరమైన చల్లని కానుపు దయచేయుటలో గల నీ ప్రేమ కనికరముల కొరకు నీకు మా నిండు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించు చున్నాము. ఈమె యెడల నీకున్న ప్రేమ కనికరమును ఈమె ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుచు, నమ్మకముగా నిన్ను సేవించుచు, మానక నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించులాగున, అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఓ దేవా, మా పరలోకపు తండ్రీ, సృజనాత్మకమైన నీ శక్తి ప్రేమల వలన ఈమెకు ఒక బిడ్డను దానముగా అనుగ్రహించితివి. ఈమెయు, ఈమె భర్తయు, తమ బిడ్డను నిత్యజీవమునకు నడిపించు మార్గములో ఎట్లు పెంచవలయునో తెలిసికొనులాగున, వీరికి జ్ఞానమును, నడిపింపును దయచేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
[ఒకవేళ బిడ్డ చనిపోయినట్లయితే కీర్తన 145:1-8 కు బదులుగా కీర్తన 63:1-8 చెప్పవలెను. పైన నియమించిన మూడు ప్రార్ధనలకు బదులుగా గురువు మాత్రమే ఈ దిగువ ప్రార్ధన చెప్పును]
కీర్తన 63:1-8: 1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును.
2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొని యున్నది. నీమీది ఆశచేత, నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
3. నీ కృప జీవముకంటె ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును.
4. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించు నప్పుడు,
5. క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది.
6. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను.
7. నీవు నాకు సహాయకుడవై యుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
సర్వశక్తిగల దేవా, ఈ నీ సేవకురాలు, యిప్పుడు నీ మందిరమునకు మరల రాగలుగునట్లుగా, ఈమె ప్రసవము వలన కలిగిన అన్ని ఉపద్రవముల నుండి ఈమెను తప్పించి, రక్షించినందుకై మేము వినయముగా నిన్ను స్తుతించుచున్నాము. అత్యంత ప్రేమగల తండ్రీ, వీరి దుఃఖములో ఈమెను, ఈమె భర్తను ఓదార్చి ఆదరించుము. వీరు విశ్వాసమునందు నిలకడగా నుండి, నీ చిత్తమును జరిగించి, తమ జీవితాంతమున నిత్యజీవము యొక్క మహిమను పొందులాగున వీరిని బలపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
(గురువు ఈ దీవెన చెప్పును): తండ్రి, కుమార పరిశుద్ధాత్మయైన సర్వశక్తి గల దేవుని దీవెన మీమీద యిప్పుడును, ఎల్లప్పుడును ఉండును గాక. ఆమేన్.
(ఇక్కడ తలిదండ్రులు తమ కృతజ్ఞతార్పణను అర్పించవలెను)
(పరిశుద్ధ సమభక్త ఆరాధన ఉన్నయెడల వారు సమభక్తమును పుచ్చుకొనుట యుక్తము)
Great