పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /08
ఆదికాండము 6:1-22
దేవుడు నోవహును, అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను, జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలును, ఆకాశపు తూములును, మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను. అప్పుడు నీళ్లు భూమిమీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. నూట ఏబది దినము లైన తరువాత నీళ్లు తగ్గిపోగా, ఏడవ నెల పదియేడవ దినమున, ఓడ అరారాతు కొండలమీద నిలిచెను. నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున, కొండల శిఖరములు కనబడెను. నలుబది దినములైన తరువాత, నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి, భూమిమీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు, అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున, తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు, గనుక, ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని, ఓడలోనికి తీసికొనెను. అతడు మరి యేడు దినములు తాళి, మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు, త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను, గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. అతడింక మరి యేడు దినములు తాళి, ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము, మొదటినెల తొలిదినమున, నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు, నీవును, నీతోకూడ నీ భార్యయు, నీ కుమారులును, నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును, వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి, అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును, అతనితో కూడ అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమిమీద సంచరించునవన్నియు, వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువు లన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను, కొన్ని తీసికొని, ఆ పీఠముమీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి, ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా, నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములును, వేసవి శీత కాలములును, రాత్రింబగళ్లును, ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
కీర్తనలు 40:1-10 [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి, నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు, ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి, భయభక్తులుగలిగి, యెహోవా యందు నమ్మిక యుంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును, మాయెడల నీకున్న తలంపులును, బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా, అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైనవాడొకడును లేడు. బలులనైనను, నైవేద్యములనైనను, నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను, పాపపరిహారార్థ బలులనైనను, నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక, మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని, నేను ఊర కుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను, నేను వెల్లడిచేసి యున్నాను. నీ కృపను, నీ సత్యమును, మహా సమాజమునకు తెలుపక, నేను వాటికి మరుగుచేయలేదు.