Daily Bible Verses in Telugu ++ బైబిల్ వాక్యాలు సువర్తస్వరం

Telugu BIBLE Verses

Daily Bible Verses in Telugu are here. For you we present బైబిల్ వాక్యాలు below

యోహా 14:1

మీ హృదయమును కలవరపడనియ్యకుడి. దేవునియందు విశ్వాసముంచుచున్నారు. (లేక దేవునియందు విశ్వాసముంచుడి) నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి, మీకు స్థలము సిద్ధపరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరల వచ్చి, నాయొద్ద నుండుటకు, మిమ్మును తీసికొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము, మీకు తెలియునని చెప్పెను.

కీర్తనలు 31:1-6

యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి, నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు, నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.  నా కొండ, నాకోట, నీవే. నీ నామమునుబట్టి త్రోవ చూపి, నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై, శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి, నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించు చున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.  నేను యెహోవాను నమ్ముకొని యున్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.

మత్త 23:1-14

అప్పుడు యేసు, జనసమూహములతోను, తన శిష్యులతోను ఇట్లనెను. శాస్త్రులును, పరిసయ్యులును, మోషే పీఠమందు కూర్చుండువారు, గనుక, వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి. అయినను, వారి  క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని, చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి, మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని, తమ వ్రేలితోనైన, వాటిని కదలింప నొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము, తమ పనులన్నియు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవి గాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, ​సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు, కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు, గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు, మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొను వాడు, తగ్గింపబడును. తన్నుతాను తగ్గించుకొనువాడు, హెచ్చింపబడును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోక రాజ్యమును మూయుదురు. ​మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింప నియ్యరు.

కీర్తనలు 113:1-9

యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము, యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని, సూర్యాస్తమయము వరకు, యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి యెదుట మహోన్నతుడు. ఆయన మహిమ, ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న, మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి, చూడననుగ్రహించు చున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో, వారిని కూర్చుండబెట్టుటకై, ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పమీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

Telugu BIBLE Verses

మార్కు 13:14-23

మరియు నాశకరమైన హేయ వస్తువు, నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు, చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దెమీద ఉండువాడు, ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై, దిగి, అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు, తన వస్త్రము తీసికొనిపోవుటకు, ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి, ఇదివరకు అంత శ్రమ కలుగలేదు. ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల, ఏ శరీరియు తప్పించు కొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా, తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము, ఆయన, ఆ దినములను తక్కువ చేసెను. కాగా, ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని, యెవడైనను మీతో చెప్పిన యెడల, నమ్మకుడి. ఆ కాలమందు, అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైన యెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై, సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో, సమస్తమును, మీతో ముందుగా చెప్పియున్నాను.

మార్కు 14:22-25

వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి, విరిచి, వారికిచ్చి, మీరు తీసికొనుడి. ఇది నా శరీరమనెను. పిమ్మట, ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాని వారి కిచ్చెను. వారందరు దానిలోనిది త్రాగిరి. ప్పుడాయన, ఇది నిబంధన విషయమై (కొన్ని ప్రాచీనప్రతులలో – క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరము) అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో, ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దానిని త్రాగనని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

Telugu Daily Bible – Scripture For The Day – July 26 

Telugu Daily Bible - Scripture For The Day - July 26 - దినచర్య ప్రకాశిక

దినచర్య ప్రకాశిక  ఉదయము జులై  26   

అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. (హెబ్రీ 11:8)         

    తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. (కీర్త 47:4) అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని, ఆవరించి, పరామర్శించి, తన కనుపాపనువలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు  యెహోవా వానిని నడిపించెను.  యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు. (ద్వితీ 32:10-12)       

    నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. (యెష 48:17) ఆయనను పోలిన బోధకుడెవడు? (యోబు 36:22)          

    వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము. (2 కొరిం 5:6)  నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచ చున్నాము.          (హెబ్రీ 13:14)     

    ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడని … మిమ్మును బ్రతిమాలుకొను చున్నాను. (1పేతు 2:11,12) ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు. మీరు లేచి వెళ్లి పోవుడి.  మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. (మీకా 2:10)      

 

దినచర్య ప్రకాశిక సాయంకాలము జులై  26   

   ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. (కీర్త 97:12)   

     ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. (యోబు 15:15,16)  ఆయన దృష్టికి  నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. (యోబు 25:5,6)

    యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు?  పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు. (నిర్గ 15:11) సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. (యెష 6:3)  

    నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని వ్రాయబడియున్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. (1పేతు 1:14,16) దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది. మీరును పరిశుద్ధులై యున్నారు. (1కొరిం 3:17) మీరు పరిశుద్ధ మైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.  (2 పేతు 3:12)

   వినువారికి మేలు కలుగునట్లు … క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి.  విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు. (ఎఫె 4:29,30)