ఆలయ ప్రతిష్ఠ – Church Dedication Service Program Sermon Scripture Pdf

church dedication scriptures

ప్రార్ధన గృహమును (ఆలయమును) ప్రతిష్ఠించు ఆరాధన క్రమము (Church Dedication Service Program)

(కీర్తన గాని సంగీతము గాని పాడుచు, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయవచ్చును)
(ఆలయ ద్వారము మూయబడి యుండగా, దాని యొక్క చరిత్ర క్లుప్తముగా చదువబడును)
(ఆరాధన గురువు తలుపు తెరచి, యిట్లు చెప్పును)
తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామమున మేము ఈ దేవుని ఆలయము తలుపు తెరచి, ఆయన జనులను లోపలి ఆహ్వానించుచున్నాము. ఆమేన్.
(గురువు లోపలి ప్రవేశించి చెప్పవలసినది ఏమనగా)
ఈ ఆలయమునకును, దీనిలో ఆరాధించువారికిని, సమాధానము కలుగును గాక. దీని లోపలి వచ్చు వారికిని, వెలుపలికి వెళ్ళు వారికిని సమాధానము కలుగును గాక.
దీని ప్రేమించు వారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రేమించు వారికిని, సమాధానము కలుగును గాక. ఆమేన్.
(జనులు ప్రవేశించి నిలిచియుండగా గురువు యిట్లు చెప్పును)
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
జనులు: భూమ్యాకాశములను సృజించినవాడు ఆయనే.
భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. (కీర్త 124:8)
గురువు: యెహోవా ఇల్లు కట్టించనియెడల,
జనులు: దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. (కీర్త 127:1)
(ఒక కీర్తన గాని సంగీతము గాని 24 వ కీర్తన గాని పాడుదురు)
భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును, యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు, పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యముల కధిపతియగు యెహోవాయే. ఆయనే, యీ మహిమగల రాజు. (కీర్త 24:1-10)
(గురువు యిట్లు చెప్పును): ప్రియ సహోదరులారా, దైవారాధన కొరకు ఈ ఆలయము కట్టుటకు (లేక ఒక స్థలము ప్రత్యేక పరచుటకు) తన సేవకుల హృదయములను, ఆయన తన చిత్త ప్రకారము ప్రేరేపించినందున, దేవుని మిక్కిలి పరిశుద్ధ నామ ఘనత కొరకు, దీనిని యిప్పుడు ప్రతిష్ఠించుదము.
మనలను ప్రేమించి, తన ప్రియునియందు మనలను అంగీకరించిన, తండ్రియైన దేవుని మహిమ కొరకు, మనలను ప్రేమించి, మన కొరకు తనను తాను అప్పగించుకొనిన కుమారుని మహిమ కొరకు, మనలను వెలిగించి, పవిత్రపరచు పరిశుద్ధాత్మ కొరకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
స్తుతి ప్రార్ధనలతో దేవుని ఆరాధించుట కొరకు, ఆయన పరిశుద్ధ వాక్యము చదువుటకు, సిలువ వేయబడి, తిరిగి లేచి, పరలోకమున కెక్కిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించుట కొరకు, ఆయన కృపా సంస్కారములు ఆచరణ కొరకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: మార్గము వెదకువారందరికిని వెలుగు చూపుటను, శోధింపబడువారిని బలపరచుటకును, దుఃఖపడు వారందరిని ఓదార్చుటకును, రోగులందరికి ఆరోగ్యము వచ్చుటకును,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: ప్రభువు నందలి జ్ఞానము, భయము, పెంపొందించుటకు, యౌవ్వనులకు బోధించి నడిపించుటకు, త్రోవ తప్పినవారినందరిని మరలించుటకు,
జనులు: మనము ఈ ప్రార్ధన ఆలయమును ప్రతిష్ఠించుచున్నాము.
గురువు: ఒకే విశ్వాసమందును, పరిశుద్ధుల సహవాసమందును, అందరియెడల ప్రేమ, సానుభూతి యందును, పరిశుద్ధాత్మ ద్వారా దైవ నివాస స్థలముగా నుండుటకు, మనకు అనుగ్రహింపబడిన దానమగు ఈ ఆలయము కొరకు కృతజ్ఞతగాను, దేవుని గృహమునకు చెందినవారమైన మనము, ఇప్పుడు ప్రతిష్ఠించుకొందము.
జనులు: దైవారాధన కొరకును, ఆయన రాజ్యమందలి సేవ కొరకును, మనలను మనము ప్రతిష్ఠించుకొను చున్నాము.
ప్రార్ధించుదము: (ఈ దిగువ వాటిలో యుక్తమైన విజ్ఞాపనలను చేయవచ్చును)
ఓ ప్రభువా, ఇది ఎల్లప్పుడు మాకు మా తండ్రి గృహముగా ఉండునట్లును, ఇక్కడ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలుసుకొనునట్లును, దయచేయుము. ఆమేన్.
ఈ గృహములో నీ పరిశుద్ధ వాక్యమును చదువు వారును, బోధించువారును, వినువారందరును, పరిశుద్ధ లేఖనములలో జీవ వాక్యమును బయలుపరచు నీ యెడల, కృతజ్ఞత కలిగి యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఈ గృహములో మేము పాడు కీర్తనలు, పరిశుద్ధమైన హృదయముల నుండియు, పవిత్రమైన పెదవుల నుండియు, బయలు వెడలునట్లు దయచేయుము. ఆమేన్.
నీ బిడ్డలు యిక్కడ చేయు ప్రార్ధనలు, అర్పించు అర్పణలు, ఎల్లప్పుడు నీ దృష్టికి అంగీకృతమై యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఇక్కడ బాప్తీస్మము పొందువారును, నిర్ధారణ పొందువారును, తమ జీవితాంతము, క్రీస్తు యొక్క నమ్మకమైన భటులును, సేవకులునై యుండునట్లు దయచేయుము. ఆమేన్.
ఇక్కడ జరుగు వివాహము లన్నియు, నీ దీవెన పొందునట్లును అనుగ్రహింపుము. ఆమేన్.
మా రక్షకుని ఆజ్ఞకు విధేయులమై, ఇక్కడ నీ బిడ్డలు ఆయన శరీర రక్తములు, సంస్కారములును పొంది, జీవాహారములో పాలిభాగస్తులై, నిరీక్షణ ద్వారా, నిత్యజీవమునకు వారసులమగునట్లు దయచేయుము. ఆమేన్.
ఈ స్థలములో జరుగున దంతయు, నీకు ప్రియామైనదిగా నుండునట్లు దయచేయుము. మా అనుదిన జీవితములను స్తుతి యాగముగాను, మా ఉల్లాసములను పరమానందముగాను మార్చి, మా వాక్య పఠనము ద్వారా మమ్మును నీ చెంతకు చేరదీయ అనుగ్రహించుము. ఆమేన్.
మన ప్రార్ధన లన్నిటిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున తానే నేర్పిన మాటలతో అర్పించుదము. ఆమేన్.
ప్రభువు ప్రార్ధన: పరలోక మందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించుచున్న ప్రకారము, మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా, రాజ్యమును, శక్తియు, మహిమయు, నిరంతరము నీవియై యున్నవి. ఆమేన్.
(గురువు యిట్లు చెప్పును): సర్వశక్తి గల దేవుని ఆరాధనకును, సేవకును, ఈ ఆలయమును (ఆలయము పేరు ….) ప్రత్యేకపరచుచున్నానని, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము పేరట ప్రకటించుచున్నాను. ఆయనకే యుగ యుగములకును, మహిమ, ఘనత, రాజ్యము, శక్తి కలుగును గాక.
జనులు: ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక.

Church Dedication Service Scripture & Sermon

(ఇక్కడ ఒక సంగీతము లేక కీర్తన పాడవచ్చును. లేక వేద పాఠముల మధ్యను పాడవచ్చును)
(ఈ పాఠములలో ఒకటి లేక ఎక్కువ చదువ వచ్చును: నిర్గ 40:17-34; 24వ కీర్తన; 84వ కీర్తన; ఎఫె 2:19-22 మత్త 21:14-16)
నిర్గ 40:17-34: రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే మందిరమును నిలువ బెట్టి, దాని దిమ్మలను వేసి, దాని పలకలను నిలువబెట్టి, దాని పెండె బద్దలను చొనిపి, దాని స్తంభములను నిలువబెట్టి, మందిరము మీద గుడారమును పరచి, దానిపైని గుడారపు కప్పును వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు శాసనములను తీసికొని, మందసములో ఉంచి, మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి, దానిమీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి, కప్పు తెరను వేసి, సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో, మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి, యెహోవా సన్నిధిని, దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో, మందిరమునకు దక్షిణ దిక్కున, బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి, యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట, బంగారు ధూపవేదికను ఉంచి, దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి, దానిమీద దహనబలి నర్పించి, నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు ప్రత్యక్షపు గుడారమునకును, బలిపీఠమునకును మధ్య, గంగాళమును ఉంచి, ప్రక్షాళణ కొరకు దానిలో నీళ్లు పోసెను.
దానియొద్ద మోషేయు, అహరోనును, అతని కుమారులును, తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును, బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును, బలిపీఠమునకును చుట్టు, ఆవరణమును ఏర్పరచి, ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. (నిర్గ 40:17-34)
కీర్త 24:1-10: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును, యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును, కలిగి యుండువాడే.
వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు, అట్టివారే. (సెలా.) గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి. మహిమగల రాజు ప్రవేశించునట్లు, పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు. (కీర్త 24:1-10)
84వ కీర్తన: సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మ సిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యముల కధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా.) నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్లుచు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు, ప్రయాణము చేయుదురు.
వారిలో ప్రతివాడును, సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవి యొగ్గుము. (సెలా.) దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట, వెయ్యి దినముల కంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యముల కధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. (84వ కీర్తన)
ఎఫె 2:19-22: కాబట్టి మీరికమీదట పరజనులును, పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును, దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా, అపొస్తలులును, ప్రవక్తలును వేసిన పునాదిమీద, మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
ఆయనలో మీరు కూడ, ఆత్మమూలముగా, దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. (ఎఫె 2:19-22)
మత్త 21:13-16: నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది. గ్రుడ్డివారును, కుంటివారును, దేవాలయములో ఆయన యొద్దకు రాగా, ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి, కోపముతో మండిపడి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి.
అందుకు యేసు, వినుచున్నాను; బాలురయొక్కయు, చంటిపిల్లల యొక్కయు, నోట, స్తోత్రము సిద్ధింపజేసితివి, అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పెను. (మత్త 21:13-16)
(యిక్కడ ప్రసంగము చేయవచ్చును)

Church Dedication Service Conclusion

(పరిశుద్ధ బల్ల, ప్రభు భోజన పాత్రలు, బల్లలు ప్రతిష్ఠింప వలసియున్న యెడల, దిగువ ప్రార్ధన చెప్పవచ్చును)
ఓ ప్రభువా, ఈ బల్లను, (యితర వస్తువులను) నీ మహిమ కొరకును, సిలువ మీద అర్పించబడిన అర్పణకు నిత్య జ్ఞాపకార్ధముగాను, ఆశీర్వదించి, ప్రతిష్ఠించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
(కీర్తన గాని, సంగీతము గాని పాడుచుండగా, కానుకలు, అర్పణలు, ప్రార్ధన ఆలయము కొరకైన వస్తువులు అర్పించవచ్చును)
ప్రార్ధించుదము
ఓ ప్రభువా, నీ సేవకై ప్రతిష్ఠించు మా కానుకలను అంగీకరించుమని, వేడుకొనుచున్నాము. ఇప్పుడు మేము ప్రత్యేకపరచిన ఈ ఆలయములో, నీ పరిశుద్ధ నామమును ఆత్మతోను, సత్యముతోను, మేము ఆరాధించునట్లు అనుగ్రహించుము. నీతోను, పరిశుద్ధాతతోను ఏక దేవుడుగా, యుగ యుగములు జీవించి యేలుచుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
దీవెన
(కొంతసేపు మౌన ప్రార్ధనకు తరువాత, గురువు వెళ్ళుచుండగా, సభవారు నిలిచి, ఒక స్తుతి కీర్తన గాని సంగీతము గాని పాడవలెను)

Suvarthaswaram.com

church dedication sermon pdf with ful program telugu.jpg

వివాహ ఆరాధన క్రమము – Pastors Christian Wedding/ Marriage Service Guide-Telugu

(ప్రవేశము) [ఒక కీర్తన లేదా సంగీతము పాడుదురు. వివాహము చేసికొనబోవు వధువు మరియు వరుడు గురువు ముందు నిలుతురు. వధువు యొక్క కుడివైపున వరుడు నిలువబడవలెను]

Church Wedding Service – Detailed program

గురువు యిట్లు చెప్పును: మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యము ద్వారా, యీ స్త్రీ పురుషులు యిద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడియున్నాము.
వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరును ఈ పద్ధతిని గౌరవించవలయునని పరిశుద్ధ గ్రంథము వివరించుచున్నది.
మన ప్రభువైన యేసు క్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించినాడు. ఇట్టి జీవిత విధానమును గురించి మన ప్రభువు వచించునది వినుడి.
మార్కు సువార్త 10:6-9:
(6) సృష్ట్యాదినుండి, (దేవుడు) వారిని పురుషునిగాను, స్త్రీనిగాను కలుగజేసెను.
(7) ఈ హేతువు చేత, పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి, తన భార్యను హత్తుకొనును.
(8) వారిద్దరు ఏకశరీరమై యుందురు. గనుక వారిక ఇద్దరుగా నుండక, యేకశరీరముగా నుందురు.
(9) కాబట్టి, దేవుడు జతపరచిన వారిని, మనుష్యుడు వేరుపరచ కూడదని, వారితో చెప్పెను.
ఈ కారణమును బట్టి, వివాహమును ఎవరును చులకనగా గాని, అనాలోచితముగా గాని పూనుకొనకూడదు.
వివాహము యొక్క ఉద్దేశములేవనగా:
మొదటిది – భార్య భర్తలిరువురు, తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి, కలిమియందును, లేమియందును, పరస్పర సహాయాదరణలు కలిగించుకొనునట్లు వివాహము నిర్ణయింపబడినది.
రెండవది – దేవుడే మానవునియందు నాటినట్టియు, క్రీస్తునందు విమోచన పొందినట్టిదియునైన, సహజ కోరికలను, ఆపేక్షలను, దేవుడు పవిత్రపరచి, యుక్తముగా ప్రయోగించునట్లు వివాహము నిర్ణయింపబడినది.
మూడవది – కుటుంబములో పిల్లలు జన్మించి, దేవుని మహిమార్ధము మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడునట్లు వివాహము నిర్ణయింపబడినది.
నాలుగవది – వివాహము ఘనమైనదిగా యెంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది యేర్పడునట్లు యియ్యది నిర్ణయింపబడినది.
వివాహము – [గురువు యిట్లు చెప్పును]
ఇక్కడనున్న వీరిద్దరు, పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చియున్నారు. కాని, యిక్కడ ఉన్నవారిలో ఎవరికైన, క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి గాని, యీ దేశ చట్టములను బట్టి గాని, వీరు వివాహమాడ రాదని, న్యాయ సమ్మతమైన హేతువు ఏదైనా తెలిసియున్న పక్షమున, దానిని యిప్పుడు వెల్లడిచేయవలెను. లేనియెడల, యిక మీదట ఎప్పటికిని ఊరుకొనవలెను.
[అభ్యంతర కారణములు ఏవియు చెప్పబడని పక్షమున, గురువు వివాహమాడనై యున్నవారితో యిట్లు చెప్పును]
మీరు ఈ వివాహము వలన జతపరచకూడదని హేతువేదైన మీలో ఎవరికైన తెలిసియున్న పక్షమున, దానిని యిప్పుడు ఒప్పుకొనవలయునని దేవుని సన్నిధానమున, మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను.
[అభ్యంతర కారణములు ఏవియు చెప్పబడని యెడల, వివాహమాడబోవు వారు పూలదండలు వేసికొనవచ్చును. అప్పుడు గురువు యిట్లు చెప్పును]
సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రీ, నీ సహాయము లేక, మేమేమియు యోగ్యముగా చేయజాలము. నీవీ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు, తీసికొనివచ్చియున్నావు.
నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులనుగా చేసి, నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించునట్లును, వీరు చేయనైయున్న ప్రమాణములను, వాస్తవముగా నిలుపుకొనునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
[అనంతరము గురువు వరుని యిట్లు అడుగవలెను] – … అను నీవు, … అను ఈ స్త్రీని, నీ భార్యనుగా చేసికొని, ఈమెను మాత్రమే హత్తుకొనియుందువా?
[పురుషుడు చెప్పవలసిన జవాబు] – ఉందును.
[గురువు స్త్రీని యిట్లు అడుగవలెను] – … అను నీవు, … అను ఈ పురుషుని నీ భర్తనుగా చేసికొని, యితనిని మాత్రమే హత్తుకొనియుందువా?
[స్త్రీ చెప్పవలసిన జవాబు] – ఉందును.
[వివాహమాడు స్త్రీ, తలిదండ్రు వలనగాని, సంరక్షకుని వలనగాని, పెండ్లికీయబడుచున్న యెడల, గురువు యిట్లు అడుగవలెను]
వివాహమాడుటకు ఈ స్త్రీని ఈ పురుషునికి యిచ్చువారెవరు? – [తల్లిగాని, తండ్రిగాని, లేక సంరక్షకుడు గాని, ముందుకు వచ్చి, స్త్రీ యొక్క కుడిచేతిని తీసికొని, పురుషుని కుడి చేతిలో నుంచుట ద్వారా, కన్యాదానము చేయవలెను. తలిదండ్రులు గాని సంరక్షకుడు గాని లేనిచో, గురువు, స్త్రీ పురుషులను సంబోధించి యిట్లు చెప్పును]
.. .. అను మీరిరువురు, ఒకరి కుడిచేతిని మరియొకరికి ఇచ్చుకొనుడి.
[ఇప్పుడు పురుషుడు గురువు వెంట చెప్పవలెను.] – … అను నేను, … అను నిన్ను, యిది మొదలుకొని, చావు మనలను ఎడబాపు వరకు, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధియందును, ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి, సంరక్షించుటకై, నా భార్యనుగా చేసికొనుచున్నాను.
ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
[స్త్రీ పురుషులట్లే చేతులు పట్టుకొని యుండగా, స్త్రీ గురువు వెంట చెప్పవలెను] – … అను నేను, … అను నిన్ను, యిది మొదలుకొని, చావు మనలను ఎడబాపు వరకు, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధియందును, ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి, సంరక్షించి, నీకు లోబడియుండుటకై, నా భర్తనుగా చేసికొనుచున్నాను.
ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
[గురువు యిట్లు చెప్పును] – దేవుడు మీ ప్రమాణములను వినియున్నాడు. వాటికి మేము సాక్ష్యులము.
[గురువు, యిప్పుడు మంగళ సూత్రమును, ఉంగరమును లేదా ఉంగరములను ఆశీర్వదించునట్లు చెప్పును]
కనికరముగల ప్రభువా, ఈ మంగళ సూత్రమును (ఉంగరమును) ఆశీర్వదించి, దీని కట్టువారును, (ధరించువారును) ఒకరి యెడల ఒకరు, నిరంతరము నమ్మకముగా మేలుగునట్లును, తామిద్దరు బ్రతుకు కాలమంతయు, ప్రేమతో జీవితము సాగించుకొనునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
[గురువు మంగళ సూత్రమును పురుషునికి యివ్వగా, ఆచార ప్రకారము పురుషుడు దానిని స్త్రీ మెడలో కట్టి, దాని పట్టుకొనును. అది ఉంగరమైన యెడల, గురువు దానిని పురుషునికి ఇవ్వగా, అతడు దానిని స్త్రీ వ్రేలికి తొడిగించి, పట్టుకొనును. అప్పుడు పురుషుడు గురువు వెంట ఇట్లు చెప్పవలెను]
నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును సూచనగా, ఈ మంగళ సూత్రమును (ఉంగరమును) నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి, ఆ ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేసికొనుచున్నాను.
[స్త్రీయు, ఒక ఉంగరమును పురుషునికి యిచ్చిన యెడల, దానిని అతని వ్రేలికి తొడిగించి, పట్టుకొని, గురువు వెంబడి యిట్లు చెప్పవలెను]
నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును సూచనగా, ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి, ఆ ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసికొనుచున్నాను.
[గురువు యిట్లు ప్రకటింపవలెను] – దేవుని సమక్షమందును, ఈ సభ యెదుటను, ఒకరినొకరు తమ ప్రమాణములను చేసియున్నారు. గనుక, దేవుని నిర్ణయమును బట్టియు, ఈ దేశ చట్టమును బట్టియు, వీరిరువురును భార్యా భర్తలని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్.
కాబట్టి, దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు యెడబాపకూడదు.
[ఇప్పుడు వధూవరులు యిద్దరు, మొకాళ్ళూనుదురు. సభ నిలిచియుండును. గురువు యిట్లు ప్రార్ధించును]
అత్యంత కృపాకనికరములు గల దేవా, పరలోకమందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, యే తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, అట్టి మా తండ్రీ, నీ నామమున దీవించుచున్న ఈ … మీదను, … మీదను, నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము.
వీరు నమ్మకముగా కలిసి జీవించునట్లును, ఉభయుల మధ్య తాము చేసికొనిన నిబంధనను, ప్రమాణములను, వీరు తప్పక నెరవేర్చి, నిలుపుకొనునట్లును, పరిపూర్ణ ప్రేమ, సమాధానములందు వీరు నిత్యము నిలిచియుండి, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించునట్లును, అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయైన దేవుడు, మిమ్మును ఆశీర్వదించి, సంరక్షించి, కాపాడును గాక.
ప్రభువు మిమ్మును అనుగ్రహముతో కటాక్షించి, పరమందు మీరు నిత్యజీవము పొందుటకై, యిహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు, ఆత్మసంబంధమైన ప్రతి దీవెనతోను, వరములతోను, మిమ్మును నింపును గాక. ఆమేన్.
ప్రార్ధనలు – [ఇప్పుడు ఒక కీర్తన గాని, సంగీతము గాని పాడబడును. లేదా ఈ క్రింద యివ్వబడిన కీర్తనలు ఒకటి గాని, రెండు గాని వల్లించవచ్చును. లేదా పాడవచ్చును. అప్పుడు వధూవరులు ప్రభువు బల్ల యొద్దకు వెళ్ళుదురు]
[‘సప్తపద’ ఆను ఆచారమును అనుసరించిన యెడల, ప్రజలు 67వ కీర్తనలోని వచనములను ఒక్కొక్క దాని తరువాత ఆగుచు, వల్లించుచుండగా, లేదా పాడుచుండగా, వధూవరులు, ఒక్కొక్క అడుగు ముందుకు వేయుదురు]
67వ కీర్తన:
(1) భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును,
(2) దేవుడు మమ్మును కరుణించి, మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.
(3) దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు.
(4) జనములు సంతోషించుచు, ఉత్సాహధ్వని చేయును గాక.
(5) దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
(6) అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
(7) దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరు, ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.
128వ కీర్తన:
(1) యెహోవాయందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవలయందు నడుచు వారందరు ధన్యులు.
(2) నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును.
(3) నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు, నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
(4) యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఈలాగు ఆశీర్వదింపబడును.
(5) సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు.
(6) నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక.
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందు, యిప్పుడు, యెల్లప్పుడు, ఉండునట్లు, యుగయుగములు కలుగును గాక.
[నూతనముగా జతపరచబడిన దంపతుల చేతులలో గురువు ఒక బైబిలును గాని, కొత్త నిబంధన గ్రంథమును గాని ఉంచి, ఈ మాటలు పలుకును]
దేవుని వాక్యము మీ పాదములకు దీపమును మీ త్రోవలకు వెలుగునై యుండును గాక! ఆమేన్.
పరిశుద్ధ గ్రంథ పాఠము (1 కొరిం 13:4-13)
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక, సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, (లేక అన్నిటిని కప్పును) అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని, పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని. పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని.
ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
ప్రసంగము చేయవచ్చును.
(పిమ్మట గురువు యిట్లు చెప్పును)
ప్రార్ధించుదము. గురువు: ప్రభువా మమ్మును కనికరించుము.
జనులు: క్రీస్తూ మమ్మును కనికరించుము.
గురువు: ప్రభువా మమ్మును కనికరించుము.
ప్రభువు ప్రార్ధన: పరలోక మందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా, రాజ్యమును, శక్తియు, మహిమయు, నిరంతరము నీవియై యున్నవి. ఆమేన్.
గురువు: ప్రభువా, ఈ నీ దాసుని, దాసురాలిని రక్షింపుము. వీరు తమ నమ్మకము నీయందు నిలువనిమ్ము.
గురువు: ప్రభువా, నీ పరిశుద్ధ సముఖమునుండి సహాయము పంపుము. వీరి నెల్లప్పుడు కాపాడుము.
గురువు: వీరికి బలమైన కోటగా నుండుము. వీరి శత్రువునకు వీరిని చిక్కనీయకుము.
గురువు: ప్రభువా, మా ప్రార్ధన అంగీకరించుము. మా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము.
సర్వశక్తిగల నిత్యుడవగు తండ్రీ, మానవజాతికి వివాహ విధిని నిర్ణయించి, నీ యాశీర్వాదము చేత పవిత్రపరచియున్నావు. ఇదిగో ఇప్పుడు భార్యా భర్తలుగా జతపరచబడిన నీ దాసులైన .. … లను ఆశీర్వదించుమని నిన్ను బతిమాలుచున్నాము. వీరు ఒకరి భారముల నొకరు భరించుచు, సుఖ దుఃఖములను పంచుకొనుచు, తమ గృహ కర్తవ్యములను కలిపి నిర్వహించుచు, నీ వాక్యమునకు విధేయులై, ప్రేమ యందు ఒకరి యెడల ఒకరు నమ్మకముగా వర్తించుచుండు నట్లును, అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
ప్రభువా, రక్షకుడవైన యేసుక్రీస్తూ, నజరేతులో భూసంబంధమైన గృహ జీవితమునందు నీవు పాలుపొందితివి గదా. ఈ నీ సేవకుల యింటియందు రాజువుగాను, ప్రభుడవుగాను, యేలుమని బతిమాలుచున్నాము. నీవు మానవులకు పరిచర్య చేసిన విధమున వీరును యితరులకు పరిచర్య చేయు వరమును దయచేయుము. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారాను, క్రియల ద్వారాను, అందరిని రక్షించు శక్తిగల, నీ ప్రేమను గూర్చి వీరు సాక్ష్యమిచ్చునట్లును అనుగ్రహింపుము. తండ్రితోను, పరిశుద్ధాత్మతోను, యేక దేవుడవుగా జీవించి, యేలుచుండు నీ పరిశుద్ధ నామము నిమిత్తమే దీనిని దయచేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
(ఇప్పుడు వివాహమైన స్త్రీ పిల్లలను కను యీడును దాటియున్న పక్షమున ఈ దిగువ వచ్చు ప్రార్ధన విడిచిపెట్టవచ్చును)
కనికరము గల ప్రభువా, పరలోకపు తండ్రీ, నీ కృపావరము వలననే మానవ జాతి వృద్ధిపొందుచున్నది. ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యమును దానము చేసి, నీకు స్తుతి మహిమ కలుగునట్లు, వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసములలో యెదుగుట చూచువరకు దివ్య ప్రేమతోను, మాన్యతతోను, కలిసి జీవించునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్.
సర్వశక్తిగల ప్రభువా, నిత్యుడవగు దేవా, మా హృదయములను, మా శరీరములను, నీ ధర్మమార్గముల యందును, నీ విధుల క్రియల యందును, మెలగునట్లు నడిపించి, పవిత్రీకరించి, పాలింపుము. ఇట్లు నీ మహా బలీయమైన సంరక్షణ ద్వారా, మా శరీరాత్మలు, యిప్పుడు, ఎల్లప్పుడును, కాపాడబడునట్లు అనుగ్రహింపుమని, మా ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్.
(ప్రభురాత్రి భోజన మాచరింపనున్న, నయ్యది రొట్టె విరుచుటతో ఆరంభింపబడును. లేనిచో, గురువు యిట్లు చెప్పును)
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రియైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీకందరకు తోడైయుండునుగాక. ఆమేన్.
(పిమ్మట ఒక కీర్తన లేక సంగీతము పాడుచుండగా, పెండ్లి రిజిస్టరులో సంతకము చేయవలెను)