పరిచయం
Start Reading Your Bible Today
ప్రతిరోజు కేవలం 5 నిముషాలు బైబిల్ చదువుకొని, ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తిచేయవచ్చు!
ఇది స్పీడ్ యుగం. బైబిలు చదవాలని మనస్సులో ఉన్నప్పటికీ, సమయం కేటాయించలేక పోతున్నామని, కాల చక్రంలోని చాలామంది క్రైస్తవ విశ్వాసులు బాధపడుతుంటారు. వారి కోసమే ఈ యాప్. ప్రయాణాలలోనైనా, పని స్థలం, బడి లేదా కాలేజీలలో బ్రేక్ సమయంలోనైనా, బైబిలు చదువుకోవాలనుకొంటే, ఆ సమయంలో బ్యాగులో నున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడడానికి, కొందరికి బైబిలు హేళన చేయబడుతుందేమో నన్న భయం, మరి కొందరికి మొహమాటం. అలా సమయా భావం లేదా బిడియం గలవారి కోసం కేవలం 5 నిముషాలు మాత్రమే తీరిక చేసుకొని తమ మొబైల్ ఫోనులో చదివి, ఒక సంవత్సర కాలంలో బైబిలు పూర్తిచేయడానికి సహాయపడేదే ఈ యాప్.
లోకానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథాలు రెండే రెండు. మొదటి గ్రంథం దేవుని మహిమైశ్వర్యమును వివరించే సృష్టి కాగా, మానవాళి మేలు కొరకు తన ప్రవక్తలచే వివరించబడి, తరతరాలకు అందించబడిన రెండవ గ్రంథం బైబిలు. బైబిలు గ్రంథం కాలంతో నిమిత్తం లేని గ్రంథం. (Age less Book) అది రెండు ఖండాల భూభాగంలో విస్తరించి, మూడు భాషలలో, వందల మంది భక్తులచే, వేల సంవత్సరాల కాలంలో వ్రాయబడిన గ్రంథాల కూర్పు. వాస్తవానికి బైబిలు అను పేరుకు మూల నామమైన గ్రీకు భాషలోని ‘బిబ్లోస్’ అనే మాటకు ‘కాగితపు చుట్టలు’ అని అర్ధం. బైబిలు ఒక గ్రంథం కాదు. అది గ్రంథాల సమూహం. ఒక గ్రంథాలయం.
బైబిలు చదవడం యొక్క ప్రాముఖ్యత:
బైబిలు చదవడం తప్పనిసరి:
బైబిలు చదవనవసరం లేదన్న మినహాయింపు ఎంతటి భక్తునికైనా, విశ్వాసికైనా లేనే లేదు. ‘మనమాయనయందు (దేవునియందు) బ్రదుకుచున్నాము. చలించుచున్నాము. ఉనికి కలిగియున్నాము. అటువలె, మన మాయన సంతానము’ (అ కా 17:28) ‘విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో’ (ఎఫె 1:18) తెలిసికొనులాగున మనకు జ్ఞానము కలుగుట కొరకు బైబిలు చదవడం తప్పనిసరి.
బైబిలులో నిత్యజీవమున్నది:
‘లేఖనములయందు, మీకు నిత్యజీవము కలదని తలంచుచు, వాటిని పరిశోధించుడి. అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి’ (యోహా 5:39) ‘క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా, రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు’ (2 తిమోతికి 3: 14-15)
బైబిలు ప్రయోజనకరమైనది: ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమై యున్నది’ (2 తిమోతికి 3:16-17) ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును’ (కీర్త 19:7)
బైబిలు దేవుని యందు భక్తి విశ్వాసాలను పెంచుతుంది:
‘వీరు (బెరయ సంఘములోని వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు, ఆలాగున్నవో లేవో అని, ప్రతి దినమును, లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత, వారిలో అనేకులును, ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను, చాల మందియు విశ్వసించిరి’ (అ కా 17:11-12)
కుటుంబ ప్రార్ధనలలో లేదా వ్యక్తిగతంగా ప్రతి రోజు, అనుకూల సమయంలో బైబిలు గ్రంథంలోని ఏదో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఒక సంవత్సర కాలంలో బైబిలు గ్రంథాన్ని పూర్తిచేయాని విశ్వాసులు అనుకొంటారు. బైబిలును ఒక గ్రంథాలయమని అనుకున్నప్పుడు, ఆ గ్రంథాలయంలోని గ్రంథాలను చదవడం ఎలా? కేటలాగు లేదా పుస్తకాల పట్టికను బట్టి మొదటి గ్రంథం నుండి అలా వరుసగా చివరివరకు బైబిలు చదవడం వలన అవగాహనలో యిబ్బంది కలుగవచ్చు. ఈ రోజు ఏ అంశం చదివితే బాగుంటుందని అనుకొంటూ, పేజీలు తిప్పి వెదకే అనుభవం కొందరు కలిగియుంటారు. అలా చదవడం వలన వారికి ఆసక్తి కలిగించిన వాక్య భాగం లేదా కీర్తన ఎన్నో మార్లు చదవబడి, కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు అనుభవం లోనికి రాకుండా పోతాయి. మరి యెలా చదివితే బాగుంటుంది?
అలాగున ఆలోచించే వారి కోసం బైబిల్ గ్రంథము కాలానుక్రమముగా (Chronologically) కూర్పుచేయబడి, పాత నిబంధన లేదా క్రొత్త నిబంధనలోని వాక్య భాగం మాత్రమే కాకుండా, దేవుని స్తుతించి, ఆరాధించే స్వభావం కలిగిన దావీదు మహారాజు కీర్తలలలో ఒక కీర్తన గాని, కొంత భాగము గాని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఈ యాప్ సిద్ధం చేయబడింది. ఆత్మసంబంధమైన సౌందర్యం కలిగి, చదవగానే దాని భావాన్ని గ్రహించడం కష్టతరమైన సొలోమోను రచించిన పరమ గీతములు తప్ప ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అన్ని గ్రంథాలలోని లేఖన భాగాలు ఒక సంవత్సర కాలంలో చదువుకోవడానికి వీలుగా ఈ యాప్ సంకలనం చేయబడింది.
ఒక దినం, 24 గంటలలో కేవలం ఐదు నిముషాలు మాత్రమే వినియోగించి, బైబిలులో యిమిడి యున్న జీవితానికి కావలసియున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ధన్యతలు, హెచ్చరికలు పొందుకొనునట్లుగా ఒక సంవత్సర కాలములో బైబిలులోని అన్ని గ్రంథాలను ధ్యానం చేయడానికి ఈ యాప్ సహాయం చేస్తుంది. సమయం అనుకూలించినప్పుడు, ఆ రోజుకు ప్రస్తావించబడిన వాక్య భాగాన్ని తమ బైబిలులో మరింత విస్తృతంగా చదువుకోవచ్చు. అలాగున దేవుని కొరకైన తమ తృష్ణను సంపూర్ణముగా తీర్చుకోవచ్చు.
ఈ యాప్ బైబిలు గ్రంథం యొక్క సంగ్రహం (Summary) కాదు. బైబిలు గ్రంథానికి ప్రత్యామ్న్యాయం కాదు. బైబిలు గ్రంథములో యిమిడియున్న అపారమైన సంపదలో కేవలం కొంతమేరకు సంగ్రహించడానికి ఒక భక్తుడు చేసిన ప్రయత్నం మాత్రమే.
‘మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన, క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును గాక. ఆమేన్! (ఎఫె 1: 17-19)