పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /02
1 యోహాను 1:1-10; 2:1-14
1యోహా 1:1-10 = జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును, మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు, మేము చూచిన దానిని, వినిన దానిని, మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది. (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్ధము) మన (మీ అని పాఠాంతరము) సంతోషము పరిపూర్ణమవుటకై, మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని, మీకు ప్రకటించు వర్తమాన మేమనగా, దేవుడు వెలుగై యున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతోకూడ సహవాసము గలవారమని చెప్పుకొని, చీకటిలో నడిచినయెడల, మనమబద్ధమాడుచు, సత్యమును జరిగింపకుందుము. అయితే, ఆయన వెలుగులోనున్న ప్రకారము, మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ప్రతి పాపము నుండి, మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక, ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతినుండి, మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
1యోహా 2:1-14 = నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, యీ సంగతులను మీకు వ్రాయు చున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది (ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు. (ప్రాయశ్చిత్తమైయున్నాడు) మన పాపములకు మాత్రమే కాదు. సర్వ లోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని, తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, వానిలో, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొను వాడు, ఆయన ఏలాగు నడుచుకొనెనో, ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయన యందున్నామని, దీని వలన తెలిసికొనుచున్నాము. ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని, క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ, మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక, అది, ఆయన యందును, మీయందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు, ఇప్పటి వరకును, చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు, వెలుగులో ఉన్నవాడు. అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు, చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డి తనము కలుగజేసెను గనుక, తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చిన్న పిల్లలారా, ఆయన నామము బట్టి, మీ పాపములు క్షమింపబడినవి గనుక, మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను. యౌవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక, మీకు వ్రాయు చున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని, ఎరిగి యున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను. యౌవ్వనస్థులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి యున్నారు గనుక, మీకు వ్రాయుచున్నాను.
కీర్తనలు 2:1-12
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి. వారి పాశములను మన యొద్దనుండి పారవేయుదము రండి, అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయు చున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములవరకు సొత్తు గాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగ గొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు, వారిని ముక్క చెక్కలుగా పగుల గొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి, భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దుపెట్టుకొనుడి. లేనియెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.