దినచర్య ప్రకాశిక ఉదయము జులై 26
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. (హెబ్రీ 11:8)
తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. (కీర్త 47:4) అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని, ఆవరించి, పరామర్శించి, తన కనుపాపనువలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు. (ద్వితీ 32:10-12)
నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. (యెష 48:17) ఆయనను పోలిన బోధకుడెవడు? (యోబు 36:22)
వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము. (2 కొరిం 5:6) నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచ చున్నాము. (హెబ్రీ 13:14)
ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడని … మిమ్మును బ్రతిమాలుకొను చున్నాను. (1పేతు 2:11,12) ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు. మీరు లేచి వెళ్లి పోవుడి. మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. (మీకా 2:10)
దినచర్య ప్రకాశిక సాయంకాలము జులై 26
ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. (కీర్త 97:12)
ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. (యోబు 15:15,16) ఆయన దృష్టికి నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. (యోబు 25:5,6)
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు? పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు. (నిర్గ 15:11) సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. (యెష 6:3)
నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని వ్రాయబడియున్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. (1పేతు 1:14,16) దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది. మీరును పరిశుద్ధులై యున్నారు. (1కొరిం 3:17) మీరు పరిశుద్ధ మైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. (2 పేతు 3:12)
వినువారికి మేలు కలుగునట్లు … క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు. (ఎఫె 4:29,30)
It’s good