పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక | Day 04

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /04

ఆదికాండము 2:1-10,15-17

ఆకాశమును, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని, యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి, యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు, ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా, దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు, తన పని అంతటినుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా, భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమ్యాకాశములు సృజించబడినప్పుడు, వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే. అదివరకు పొలమందలియే పొదయు, భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు. ఏలయనగా, దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమినుండి లేచి, నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా, నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా, తూర్పున ఏదెనులో ఒక తోటవేసి, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు, దేవుడైన యెహోవా, చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. మరియు, ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి, అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.

మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని, ఏదెను తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును, దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున, నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

కీర్తనలు 34:1-22

[దావీదు అబీమెలేకు యెదుట వెర్రివానివలె ప్రవర్తించి, అతనిచేత తోలివేయబడిన తరువాత, రచించిన కీర్తన]

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణచేయగా, ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనతట్టు చూడగా, వారికి వెలుగు కలిగెను. వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా, యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలోనుండి, అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు, ఆయన దూత కావలియుండి, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి, ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?  మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?  చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను, కాచుకొనుము. కీడు చేయుట మాని, మేలు చేయుము. సమాధానము వెదకి, దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును, భూమిమీద నుండి కొట్టివేయుటకై, యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలోనుండి, వారిని విడిపించును. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు, అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.

 

Leave a Comment