పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక । Day 03

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /03

ఆదికాండము 1:6-28, 31

మరియు, దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు, ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా, ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా, రెండవ దినమాయెను. దేవుడు, ఆకాశము క్రిందనున్న జలము లొక చోటనే కూర్చబడి, ఆరిన నేల కనబడును గాకని పలుకగా, ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను, భూమి మొలిపించుగాకని పలుకగా, ఆ ప్రకార మాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా, మూడవ దినమాయెను. దేవుడు, పగటిని రాత్రిని వేరుపరచునట్లు, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు, అవి ఆకాశ విశాలమందు, జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు, ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును,  పగటిని, రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును, దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా, నాలుగవ దినమాయెను. దేవుడు, జీవముకలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు, జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటి నన్నిటిని, దాని దాని జాతి ప్రకారము, రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధిపొంది, సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా, అయిదవ దినమాయెను. దేవుడు, వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను, భూమి పుట్టించుగాకని పలికెను. ఆప్రకారమాయెను. దేవుడు, ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము, నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము. వారు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును, ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు, తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి, అభివృద్ధిపొంది విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరచు కొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

దేవుడు, తాను చేసినది యావత్తును చూచినప్పుడు, అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా, ఆరవ దినమాయెను.

కీర్తనలు  8:1-9

[ప్రధాన గాయకునికి – గిగీత్ (ద్రాక్ష గానుగ – గుడారముల పండుగ సందర్భము) రాగమును బట్టి పాడదగినది – దావీదు కీర్తన]

యెహోవా, మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను, పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి, బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు, స్తుతుల మూలమున, నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు. నీ చేతి పనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు, వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటె, వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో, వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికార మిచ్చియున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించువాటి నన్నిటిని, వాని పాదముల క్రింద నీవు ఉంచి యున్నావు. యెహోవా మా ప్రభువా భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!

 

Leave a Comment