పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక | Day-1

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక = బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /01 రొజు

ఆదికాండము 1:1-5; యోహాను సువార్త 1:1-18

ఆది 1:1-5 =  ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు, వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా, ఒక దినమాయెను.

యోహా 1:1-18 = ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆయన, ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్న దేదియు, ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు, అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని, ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు, అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోక మాయన మూలముగా కలిగెను గాని, లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు, ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు, ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను, పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా, మనమధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన, అద్వితీయకుమారుని (లేక జనితైక కుమారుని) మహిమవలె, మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్య మిచ్చుచు, నా వెనుక వచ్చువాడు, నాకంటె ప్రముఖుడు గనుక, ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు, ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి, మనమందరము, కృప వెంబడి కృపను పొందితివిు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అను గ్రహింపబడెను. కృపయు సత్యమును, యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును, ఎప్పుడైనను, దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే (లేక జనితైక కుమారుడే) ఆయనను బయలు పరచెను.

 

కీర్తనలు  19:1-14  [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు. మాటలులేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది. లోక దిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి.  వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు, పెండ్లి కుమారునివలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు, తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి, ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోష పరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. తేనెకంటెను, జుంటితేనె ధారలకంటెను, మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి, నన్నునిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనియ్యకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై, అధిక ద్రోహము చేయకుండ నిందారహితుడనగుదును. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును, నా హృదయ ధ్యానమును, నీ దృష్టికి అంగీకారములగును గాక.

Leave a Comment